మనసే జలపాతం.. పిలిచే మనకోసం

watter fals in india

చినుకు పడితే… పుడమి పులకరిస్తుంది.. జడివాన కొడితే.. వాగు ఉరకలేస్తుంది.. వాగు అడవులు దాటి… కోనలు తిరిగి.. కొండలు చేరుతుంది.. ఉరుకులు పరుగులతో కొండను దిగుతుంది. దుమికే ఆ వాగును శిరస్సెత్తి చూస్తే మనసు పరవళ్లు తొక్కుతుంది.. ఆకాశం నుంచి పాలసంద్రం నేలకు దిగుతున్న దృశ్యం… తుంపర్ల పన్నీరు జల్లి మనల్ని ఆహ్వానిస్తుంది.. జలసవ్వడుల తోరణం కట్టి రమ్మంటుంది. పాలనురుగులో తడిసి పొమ్మంటుంది. రండి మరి! జలపాతాలెన్నో పిలుస్తున్నాయ్‌ వెళ్లొద్దాం!

నాలుగు పాయల నజరానా
జోగ్‌ఫాల్స్‌, కర్ణాటక

కర్ణాటక ట్రావెలోకంలో అద్భుతమైన ప్రదేశం జోగ్‌ఫాల్స్‌. పచ్చని పశ్చిమకనుమల్లో అతిఎత్తయిన జలపాతమిది. 830 అడుగుల ఎత్తు నుంచి జాలువారే నీటిధారలు పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. శరావతి నదీ జలాలు నాలుగు పాయలుగా చీలి కిందికి దూకుతాయి. అవే రాజు, రాణి, రోరర్‌, రాకెట్‌. రాజుపాయలోని జలాలు నిర్మలంగా, రాజసంగా జాలువారితే.. రాణిపాయలోని నీళ్లు ఒయ్యారాలు ఒలకబోస్తూ, వంపులు తిరుగుతూ సొంపుగా కనిపిస్తాయి. రోరర్‌ పాయ జలాలు పెద్దపెద్ద ధ్వనులు చేస్తూ దుముకుతాయి. రాకెట్‌ పాయలోని నీళ్లు సన్నని ధారగ పడినా.. అత్యంత వేగంగా కిందికి దూసుకొస్తాయి. ఇలా వీటి స్వభావాల రీత్యా ఆ పేర్లు పెట్టారు. జలపాతం అడుగు భాగానికి చేరుకోవడానికి 1400 మెట్లు ఉంటాయి. జలపాతం కిందికి పర్యాటకులను అనుమతించడం లేదు. వ్యూపాయింట్‌ నుంచి చూడొచ్చు. నిండుగా పచ్చదనంతో అలరించే కొండల మధ్య జాలువారే ఈ జలపాతాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. జలపాతం దగ్గర సాయంత్రం పూట జరిగే లేజర్‌ లైట్‌షో చాలా బాగుంటుంది.
రవాణా మార్గం: హుబ్లీ నుంచి 161 కి.మీ, మంగళూరు నుంచి 220 కి.మీ దూరంలో జోగ్‌ఫాల్స్‌ ఉంటుంది. సికింద్రాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి హుబ్లీకి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో జోగ్‌ఫాల్స్‌ చేరుకోవచ్చు.
* హైదరాబాద్‌ నుంచి మంగళూరుకు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మంగళూరు నుంచి ట్యాక్సీల్లో జోగ్‌ఫాల్స్‌ చేరుకోవచ్చు.
సౌకర్యాలు: జలపాతం సమీపంలో గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లకు కొదువ లేదు. చాలామంది పర్యాటకులు మంగళూరు, మురుడేశ్వర్‌లో బస చేస్తుంటారు.

ఇవీ చూడండి
*కుంటాల, గాయత్రి పొచ్చెర, కనకాయి జలపాతాలు ఆదిలాబాద్‌ జిల్లా
* భీమునిపాదం, మహబూబాబాద్‌ జిల్లా
* ఎత్తిపోతల, గుంటూరు జిల్లా
* తలకోన, చిత్తూరు జిల్లా
* భైరవకోన, ప్రకాశం జిల్లా
* అమృతధార, మారేడుమిల్లి
* పెంచలకోన, నెల్లూరు
మన నయాగరా
బొగత, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని పామనూరు కొండల్లో పుట్టిన పిల్ల కాలువా.. ఏరులా మారి.. వాగులా ఉరకలేసి.. వనవిహారం చేసి.. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి దగ్గరికి వచ్చేసరికి.. యాభై అడుగుల ఎత్తు నుంచి జలజల సవ్వడితో భుగభుగ పొగలు కక్కుతూ దూకుతుంది. అందుకే ఈ జలపాతానికి బొగత అన్న పేరు వచ్చింది. ఇది అచ్చంగా ప్రపంచ ప్రఖ్యాత నయాగరా జలపాతంలా.. గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. వర్షాకాలం మొదలు నిండుగా ప్రవహిస్తూ.. పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. వేగంగా దుమికే జలధారలతో జలపాతం కింద భారీ గుండాలు ఏర్పడ్డాయి. దేవతలు వచ్చి వీటిలో స్నానం చేస్తారని స్థానికుల విశ్వాసం. అందుకే బొగత జలపాతాన్ని స్థానికులు పుణ్యతీర్థంగా భావిస్తారు. కొంతకాలంగా ఈ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువవుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల నుంచి తరలివస్తున్నారు. జలపాతం దగ్గర నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి.
రవాణా మార్గం: బొగత జలపాతం వరంగల్‌ నుంచి 135 కి.మీ దూరంలో ఉంటుంది. ఏటూరునాగారం నుంచి 24 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి ఏటూరునాగారానికి బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బొగత జలపాతానికి ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
సౌకర్యాలు: జలపాతం దగ్గర ఎలాంటి వసతులు ఉండవు. చిరుతిళ్లు తప్ప.. భోజనం లభించదు. ఏటూరునాగారంలో బస చేయాల్సి ఉంటుంది.

అద్దిరిపోద్ది
అత్తిరిపల్లి,

కేరళ పశ్చిమ కనుమల్లో నెలకొని ఉన్న కేరళలో అద్భుతమైన జలపాతాలు ఎన్నో! ఇక్కడి షోలయార్‌ శ్రేణుల ప్రారంభంలో చాలకుడి నదిపై ఉన్న అత్తిరిపల్లి జలపాతం అద్భుతంగా ఉంటుంది. దట్టమైన అడవిలో ఉన్న ఈ జలపాతాన్ని వీక్షించడానికి విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. 80 అడుగుల ఎత్తు నుంచి 330 అడుగుల వెడల్పుతో చిన్నాపెద్ద పాయలతో చూపరులను కట్టిపడేస్తుంది. అల్లంత దూరం నుంచే జలపాత హోరు చెవిన పడుతుంది. దగ్గరికి వెళ్లే కొద్దీ.. ఆశ్చర్యం కలుగుతుంది. జలపాతంలో నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తుంటాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. అత్తిరిపల్లి పరిసరాల్లో ట్రెక్కింగ్‌, రివర్‌ రాఫ్టింగ్‌ వంటి సాహస క్రీడలకు అవకాశం ఉంది. ఈ ప్రాంతం వలస పక్షులతో సందడిగా ఉంటుంది. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పక్షుల కువకువరాగాలు జలపాత హోరుకు కోరస్‌గా వినిపిస్తాయి.
రవాణా మార్గం: అత్తిరిపల్లి జలపాతం.. త్రిశూర్‌ నుంచి 59 కి.మీ, కొచ్చిన్‌ నుంచి 70 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి బస్సులు, ప్రవేట్‌ ట్యాక్సీల్లో జలపాతానికి చేరుకోవచ్చు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి కొచ్చిన్‌, త్రిశూర్‌కు రైళ్లు అందుబాటులో ఉంటాయి.
సౌకర్యాలు: జలపాతం సమీపంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వసతి గృహాలు ఉన్నాయి. భోజన వసతి అందుబాటులో ఉంది.

సరిహద్దు సౌందర్యం
హోగెనెక్కల్‌, కర్ణాటక

కావేరి నదిపై ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైనది హోగెనెక్కల్‌. దాదాపు 62 అడుగుల ఎత్తు నుంచి జలరాశులు పొగలు కక్కుకుంటూ దూకుతాయి. ఇది కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని మేలగిరి పర్వత శ్రేణుల్లో ఉంటుంది. కన్నడలో హోగె అంటే ‘పొగ’ అని, కల్‌ అంటే ‘రాళ్లు’ అని అర్థం. కావేరి జలాలు వేగంగా ప్రవహిస్తూ.. బండరాళ్లపై దూకడం వల్ల నీటి తుంపర్లతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంటుంది. అందుకని ఈ జలపాతం పేరు హోగెనెక్కల్‌గా స్థిరపడింది. మేలగిరి కొండల్లోని పచ్చదనం, జలపాతం సోయగాలు.. పర్యాటకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. హోగెనెక్కల్‌ పరిసరాల్లో ట్రెక్కింగ్‌ అవకాశం ఉంది. జలపాతం దిగువన తెప్పల్లో విహారం సినిమా సీన్లను తలపిస్తుంది. పదుల సంఖ్యలో తెప్పలు కావేరి నదిలో గింగిరాలు కొడుతూ తిరుగుతుంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో జలపాతం కనువిందు చేస్తుంది. ఇక్కడికి సమీపంలో రిసార్ట్స్‌, రెస్టారెంట్లు బోలెడున్నాయి.
రవాణా మార్గం: హోగెనెక్కల్‌ జలపాతం బెంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.
సౌకర్యాలు: రెస్టారెంట్లు, లాడ్జ్‌లు ఉన్నాయి. ఆహారానికి ఇబ్బంది ఉండదు.

చల్లని జల్లు
కటికి, విశాఖపట్టణం

ఆంధ్రా ఊటీ అరకులోయ విహారానికి వెళ్లినవాళ్లు బొర్రాగుహలు చూశాక ఆశ్చర్యానికి లోనవుతారు. గుహలోని సహజంగా ఏర్పడిన శిల్పాకృతుల గురించే మాట్లాడుకుంటూ కటికి జలపాతానికి పయనమవుతారు. కొంత దూరం ట్యాక్సీల్లో ప్రయాణం. అప్పుడు కూడా గుహ ముచ్చట్లే! ఆ తర్వాత ఓ కిలోమీటర్‌ నడవాల్సి ఉంటుంది. నడక దారిలోనూ బొర్రా సంగతులే! ఈ మాటలకు అడ్డుతగులుతూ ఎక్కడి నుంచో జలజలమని సవ్వడి.. అడుగులు వేసే కొద్దీ.. జలపాతగీతం మరింత మధురంగా చెవిన పడుతుంటుంది. గుహల ముచ్చట్లు గాల్లో తేలిపోతాయి. చిక్కగా పరుచుకున్న చెట్ల మధ్యలో నుంచి వంగి వంగి వెళ్తే.. ఆనందాశ్చర్యాలు ఒకేసారి కలుగుతాయి. 350 అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతం. జలధారల నుంచి విడివడిన నీటి బిందువులు సూదిమొనల్లా గుచ్చుకుంటాయి. మంచుకరిగి మీద పడుతోందా అన్నంత చల్లగా ఉంటాయా నీళ్లు. ఇంతటి మనోహరమైన దృశ్యం చూశాక.. అందరూ జలపాతం కిందికి చేరుకుంటారు. నిమిషాలు.. గంటలు.. అక్కడే కేరింతలు కొడుతూ ఉండిపోతారు. వర్షాకాలం మొదలయ్యే కటికి సోయగాలు వేసవి వచ్చేవరకూ కొనసాగుతాయి.
రవాణా మార్గం: కటికి జలపాతం బొర్రాగుహలకు 7 కి.మీ దూరంలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి ఉదయం ఐదు గంటలకు కిరోండూల్‌ పాసింజర్‌ రైలులో బొర్రాగుహలకు చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో జలపాతానికి కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లొచ్చు. ఆపై కాలినడకన వెళ్లాలి.
సౌకర్యాలు: కటికి జలపాతానికి వెళ్లే నడకదారిలో చిరుతిళ్లు లభిస్తాయి. బొర్రాగుహల దగ్గర బస, భోజన వసతులు ఉన్నాయి.

Related posts

Leave a Comment