నీతి తప్పిన పోలీసు అధికారులపై వేటు

Unformal relationship between acp and ci

ఏఎస్పీ సునీతరెడ్డి, కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి సస్పెన్షన్‌ 
అనుమతి లేకుండా నగరం వదిలి వెళ్లొద్దంటూ ఏఎస్పీకి ఆదేశాలు 
కేసు దర్యాప్తు ముమ్మరం 
ఇద్దరి వాట్సప్‌ సంభాషణలపై కేపీహెచ్‌బీ పోలీసుల ఆరా 

అనైతిక వ్యవహారాలతో పోలీస్‌శాఖ పరువును బజారుకీడ్చిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం అదనపు ఎస్పీ సునీతరెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గార్డెనియా గేటెడ్‌ కమ్యూనిటీలోని ఏఎస్పీ సునీతరెడ్డికి చెందిన ఫ్లాట్‌ నుంచి వస్తూ సీఐ మల్లికార్జున్‌రెడ్డి ఆమె భర్త సురేందర్‌రెడ్డికి పట్టుబడటం, ఈ సందర్భంగా ఆయన అమ్మతోపాటు..అత్త, పెద్దత్త(ఏఎస్పీ అమ్మ, పెద్దమ్మ) ప్రమీల, సునందలు సీఐపై చెప్పులతో దాడిచేయడం తెలిసిందే.’ ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు సీఐని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం ఉత్వర్వులిచ్చారు. సీఐపై నమోదైన కేసు తాలూకూ ఎఫ్‌ఐఆర్‌లో ఏఎస్పీ పేరు ఉండటం, ఆమె అనైతిక ప్రవర్తనతో పోలీస్‌శాఖ ప్రతిష్ఠ మసకబారిందన్న కారణంతో ఆమెపైనా సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ కాలంలో ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏఎస్పీ హైదరాబాద్‌ దాటి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దర్యాప్తు ముమ్మరం: మరోవైపు సీఐపై నమోదైన కేసు దర్యాప్తును కేపీహెచ్‌బీ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో సాక్షులుగా ఉన్న ప్రమీల, సునంద, సురేశ్‌(సురేందర్‌రెడ్డి స్నేహితుడు)తో పాటు..అపార్ట్‌మెంట్‌ కాపలాదారు వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏఎస్పీ ఫ్లాట్‌ లోపలికి సీఐ ప్రవేశిస్తున్న సమయంలో, ఇద్దరూ లోపల ఉండగా ఆమె భర్త తలుపు తట్టి బయటికి రప్పించిన సందర్భంలో నమోదైన సీసీ పుటేజీ దృశ్యాలనూ సేకరించారు. వారిద్దరి మధ్య సాగిన వాట్సప్‌ సంభాషణలు, కాల్‌డేటా వివరాలనూ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: హోంమంత్రి
మరోవైపు ఈ వ్యవహారంపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకే అధికారులిద్దర్నీ సస్పెండ్‌ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts

Leave a Comment