కథ వినగానే పెళ్లి చేసుకోవాలనిపించింది!

‘‘కొన్నేళ్లుగా మా అమ్మ నాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ నాకు ఇప్పుడు చేసుకొనే ఉద్దేశం లేదని చెబుతూ వస్తున్నా. సతీష్‌ వేగేశ్న ఈ కథ చెప్పగానే పెళ్లి చేసుకోవాలన్నంత అనుభూతి కలిగింద’’న్నారు నితిన్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. రాశీ ఖన్నా, నందిత శ్వేత కథానాయికలు. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ స్వరకర్త. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో పాటల విడుదల వేడుక జరిగింది. రాజేంద్రప్రసాద్‌ మనవరాలు సాయి తేజస్విని తొలి సీడీని ఆవిష్కరించి, చిత్రబృందానికి అందజేసింది. అనంతరం నితిన్‌ మాట్లాడుతూ ‘‘కథ విన్నాక పెళ్లి చేసుకోవాలనిపించింది కానీ.. సెట్లో పూజలు, వ్రతాలు చూసి పెళ్లి అంటే ఇంత కష్టమా అనిపించింది. కానీ పెళ్లి మాత్రం చేసుకొంటా. నా కెరీర్‌ అయిపోయాక, నేను ముసలివాణ్ని అయ్యాక కూడా నా కెరీర్‌లో ఈ సినిమా ఒకట్రెండు స్థానాల్లో ఉంటుంది. మిక్కీ చాలా మంచి పాటలు అందించాడు. దిల్‌రాజు ఒక తపన, క్రమశిక్షణతో పనిచేశారు కాబట్టి గొప్ప చిత్రాల్ని నిర్మించారు. ఈ సినిమా నానొక అందమైన జ్ఞాపకం’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో ఉత్తమమైన చిత్రమిది. కథ చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యా. విలువలున్న ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది. నితిన్‌తో మరిన్ని సినిమాలు కలిసి చేయాలని ఉంద’’ని చెప్పింది. ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ‘‘ఈ సంస్థకీ నాకూ ఒక అనుబంధం ఉంది. మరో మైలురాయి ఈ చిత్రం. ఎంత పెట్టుబడి పెట్టినా… మంచి తనాన్ని, మంచి విషయాల్ని, మంచి వాతావరణాన్ని సమాజంలోకి తీసుకురావాలనే సంకల్పంతో సినిమా తీస్తుంటాడు దిల్‌రాజు. పెళ్లిళ్ల గురించి డాక్యుమెంటరీ కాదు. ఈ సినిమా ఒక మంచి అనుభూతి’’అన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘41 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో వేడుకల్ని చూశా. నా జీవితంలో ఎప్పుడూ కుటుంబంతో కలిసి సినిమా వేడుకకి వెళ్లలేదు.

తొలిసారి ఈ వేడుకకి వచ్చాను. జాతీయ పురస్కారం అందుకొన్న ‘శతమానం భవతి’ తర్వాత మళ్లీ ఒక మంచి చిత్రాన్ని తీశారు సతీష్‌ వేగేశ్న. దిల్‌రాజు 24 గంటలూ సినిమా గురించే ఆలోచించే నిర్మాత’’ అన్నారు. జయసుధ మాట్లాడుతూ ‘‘ఈ సంస్థతో ‘బొమ్మరిల్లు’తో మా ప్రయాణం మొదలైంది. నిర్మాతల్లో రామానాయుడు తర్వాత దిల్‌రాజు అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించడం మంచి అనుభవమ’’న్నారు. మిక్కీ జె.మేయర్‌ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుతో పనిచేసేటప్పుడు ఒక భయం ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం సులభంగా పనిచేశా’’అన్నారు. సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ ‘‘పెళ్లి గురించి చెప్పాలనుకొని రాసిన ఓ కథ ఈ సినిమా. అనుబంధాల తోరణాలు, అనురాగాల మాలికలు, అత్మీయతలు చలువపందిళ్లు, మగపెళ్లివారి ముచ్చట్లు, ఆడపెళ్లివారి అచ్చట్లు, స్నేహితుల అల్లరి, బంధువుల సందడి అన్నీ కలగలిసిన కమనీయం.. కడు రమణీయం, మా ఈ శ్రీనివాసకళ్యాణం. ఈ రోజుల్లో పెళ్లి ఈవెంట్‌ అయిపోయింది. అదొక మధురఘట్టం. సమష్టి కృషితోనే ఈ సినిమా ఇంత వేగంగా పూర్తయింది. ఈ సినిమాకి తొలి విజయం మిక్కీ జె.మేయర్‌ నుంచి వచ్చింది. శ్రీమణి మంచి పాటలు ఇచ్చాడు. నిర్మాతలు ప్రోత్సాహంతోనే ఈ సినిమా రాశా. నితిన్‌ బాగా నటించార’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘దర్శకుడు కథ చెప్పాక…. తిరుపతి ఏడు కొండలస్వామి దర్శనం దగ్గర ఈ కథ విస్తృతమైంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సంఘటనలే ఈ చిత్రం. ఆగస్టు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమని, సితార, శివకృష్ణ, నరేష్‌, సునీత, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, సునీత, సమీర్‌రెడ్డి, శిరీష్‌, లక్ష్మణ్‌, నందిత శ్వేత, పూనమ్‌కౌర్‌, హర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment