‘రంగస్థలం’ టీజర్‌ వచ్చేసింది!

‘‘నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే అండీ ఊర్లో అందరూ మనల్ని ‘సౌండ్‌ ఇంజనీరు’ అంటారు’’ అని అంటున్నారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం చిత్ర బృందం విడుదల చేసింది.

ఇందులో చరణ్‌ గత అన్ని సినిమాలకంటే భిన్నంగా కనిపించారు. ఆయన డైలాగ్‌ డెలివరీ కూడా కొత్తగా అనిపించింది. గోదావరి యాసలో చరణ్‌ డైలాగ్‌లు పలికారు. ఈ టీజర్‌ నేపథ్యంలో ‘రంగ.. రంగ.. రంగస్థలాన’ అని వచ్చిన పాట హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చరణ్‌ మూగ, చెవిటి వ్యక్తిగా కనిపిస్తాడని చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచార చిత్రంలో చిట్టిబాబుగా తనకు వినపడదని మాత్రమే రామ్‌చరణ్‌ చెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తో్ంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నాటి కాలాన్ని తలపిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ.5 కోట్లతో పెద్ద సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్‌ జరుగుతోన్నట్లు సమాచారం. మార్చి 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts

Leave a Comment