పడుపు ఊబిలో పడతి… వలవిసిరి ఉచ్చులోకి లాగుతున్న ముఠాలు

padupu ubhilo padathulu,చెన్నై, భీమవరం, మంచిర్యాల,sex rocket

వ్యభిచార ముఠాల నిర్వాహకులకు ఇదొక వ్యాపారం. యువతులు, బాలికలు వారికి వ్యాపార వస్తువు. వంచన వారి పెట్టుబడి. అభాగ్యులు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారు.. ఇంట్లో అలిగి బయటకొచ్చేసి ఒంటరిగా తచ్చాడుతున్న వారు.. వారికి లక్ష్యం. వళ్లంతా కళ్లు చేసుకొని ప్రధానంగా రైల్వేస్టేషన్‌లు, బస్టాండులలో వల పన్ని కూర్చుంటారు. కొద్దిగా బిక్కుబిక్కుమని ఎవరైనా కనిపించారంటే చాలు. మాట కలిపి ఆప్యాయత ఒలకబోస్తారు. పూర్తిగా వలలో చిక్కుకుందని నమ్మకం కుదిరితే క్రమక్రమంగా వ్యభిచార ఊబిలోకి దించేస్తారు. చెప్పినట్టు విన్నారా సరేసరి.. లేదంటే లొంగేంతవరకూ చిత్రహింసలకు గురిచేస్తారు. కాళ్లు, చేతులు కట్టేసి.. కళ్లల్లో కారం ముద్దలు పెట్టేవారు కొందరు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఇలా ఒక్కో ముఠా క్రూరమైన పద్ధతులలో తమ దారికి తెచ్చుకుంటున్నాయి. బానిసలుగా మార్చుకుని వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాయి. కొంతకాలం తర్వాత సంతల్లో పశువుల మాదిరి వారిని ఇరల రాష్ట్రాల్లోని మరో వ్యభిచార ముఠాకు విక్రయించేస్తున్నాయి. ఈ తరహా వ్యవస్థీకృత ముఠాలు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇలాంటి వ్యభిచార గృహాల వివరాలు తెలిసినప్పటికీ పోలీసు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో ఈ వృత్తిలోని పలువురితో మాట్లాడినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి.

ఆమె వయస్సు ఇరవై ఏళ్లు. తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. చేరదీసి ఆదరించిన బంధువులేమో ఓ వృద్ధుడికిచ్చి కట్టబెట్టారు. ఆ పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ఏదో ఒక పనిచేసుకుని తన కాళ్లపై తాను నిలబడాలన్న ఉద్దేశంతో ఇంటి నుంచి పారిపోయి విజయవాడకు చేరింది. ఉపాధి కోసం వెతుకుతుండగా…ఓ ఆటో డ్రైవర్‌ పనికల్పిస్తానని నమ్మించి విజయవాడ జక్కంపూడి కాలనీలో ఓ వ్యభిచార గృహానికి రూ.20 వేలుకు ఆమెను అమ్మేశాడు. అక్కడికి చేరిన మరుసటి రోజు నుంచే ఆమెకు ప్రత్యక్ష నరకం కనిపించింది. బలవంతంగా వ్యభిచారం చేయమనడం… ఒప్పుకోకపోతే గొడ్డును కొట్టినట్లు కొట్టడం నిత్యకృతమైంది. మొదట్లో కొన్ని రోజులు ఇంటిలోనే వ్యభిచారం చేయించిన నిర్వాహకురాలు తర్వాత ఆ యువతిని చెన్నై, భీమవరం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లోని విటుల వద్దకు పంపించేది. కొన్ని నెలల తర్వాత గుంటూరులోని మరో వ్యభిచార గృహానికి విక్రయించేసింది. అక్కడి నుంచి తప్పించుకుని బయటపడిన ఆ యువతి స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఆ నరకకూపం నుంచి ఆమెకు విముక్తి కలిగింది.
– ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ గిరిజన యువతికి విజయవాడలో ఎదురైన ఈ అనుభవం నెల రోజుల కిందట వెలుగుచూసింది.

తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి పారిపోయిన ఓ బాలిక విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరింది. ఒంటరిగా కనిపించిన ఆమెపై ఓ వ్యభిచార ముఠా సభ్యురాలు కన్నేసింది. తనతో వస్తే సొంత కుమార్తెలా చూసుకుంటానంటూ వల విసిరింది. తన ఇంట్లోనే బంధించేసి బలవంతంగా వ్యభిచారం చేయించేది. కొంతకాలానికి ఆ బాలిక పాతబడిపోయిందని యలమంచిలిలోని మరో వ్యభిచార గృహ నిర్వాహకుడుకు రూ.30 వేలకు అమ్మేసింది. అక్కడ నరకం అనుభవించిన ఆమె తప్పించుకుని నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రానికి చేరినా ఆ వ్యభిచార ముఠా సభ్యులు ఆమెను వదల్లేదు. అక్కడి నుంచి ఆమెను అపహరించే ప్రయత్నం చేశారు. స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.

– శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ 16 ఏళ్ల బాలికకు విశాఖపట్నంలో ఎదురైన ఈ అనుభవం ఏడాది కిందట వెలుగుచూసింది.
Tags:  padupu ubhilo padathulu,చెన్నై, భీమవరం, మంచిర్యాల,sex rocket

Related posts

Leave a Comment