మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌ రివ్యూ

చిత్రం: మిషన్‌ ఇంపాసిబుల్‌ ఫాలౌట్‌
నటీనటులు: టామ్‌ క్రూజ్‌, హెన్రీ కవిల్‌, వింగ్‌ రేమ్స్‌, సిమన్‌ పెగ్‌, రెబాక ఫెర్గ్యూసన్‌, సీన్‌ హారిస్‌, ఏంజిలా బాసెట్‌ తదితరులు
సంగీతం: లార్నీ బాల్ఫీ
సినిమాటోగ్రఫీ: రాబ్‌ హార్డీ
ఎడిటింగ్‌: ఎడ్డై హామిల్టన్‌
నిర్మాత: టామ్‌ క్రూజ్‌, జేజే అబ్రామ్స్‌, డేవిడ్‌ ఎల్లిసన్‌
దర్శకత్వం: క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ
బ్యానర్‌: పారామౌంట్‌ పిక్చర్స్‌
విడుదల తేదీ: 27-07-2018

ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ కలిగిన చిత్రాల్లో ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ సిరీస్‌ ఒకటి. టామ్‌ క్రూజ్‌ కథానాయకుడిగా ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో వచ్చిన ఐదు చిత్రాలూ విజయం సాధించాయి. 1996లో వచ్చిన తొలి చిత్రం మొదలుకొని ఇప్పుడు విడుదలవుతున్న ఆరో చిత్రం వరకూ టామ్‌క్రూజే కథానాయకుడిగా నటించారు. వాటిలో ఈథన్‌ హంట్‌ అనే గూఢచారి పాత్రలో నటింటిన టామ్‌.. తన పోరాటాలు, సాహసాలతో యాక్షన్‌ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మిషన్‌ ఇంపాసిబుల్‌ సిరీస్‌ చిత్రాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆరో చిత్రంగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌‌’పై భారీ క్రేజ్‌ ఏర్పడింది. ఈ చిత్రంలోనూ టామ్‌ ప్రధాన పాత్రలో నటించాడు. హెన్రీ కెవిల్‌, వింగ్‌ రేమ్స్‌, సిమన్‌ పెగ్‌, రెబాక ఫెర్గ్యూసన్‌ కీలక పాత్రల్లో నటించారు. క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ తెరకెక్కించారు. టామ్‌ క్రూజ్‌ సహ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? గత చిత్రాల మాదిరిగా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది?

కథేంటంటే: ఉగ్రవాదుల నాయకుడు సోలోమన్‌ లేన్‌ను పట్టుకున్న రెండేళ్ల తర్వాత అతడి బృందంలోని మిగిలిన సభ్యులంతా ‘ది అపోసల్‌’ అనే ఒక గ్రూప్‌గా ఏర్పడతారు. వీరంతా ప్రపంచాన్ని అంతం చేయాలని ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అందుకు ప్లుటోనియంతో తయారు చేసిన మారణాయుధాలను ఉపయోగించాలని భావిస్తారు. ఉగ్రవాదుల పన్నాగం తెలుసుకున్న ఈథన్‌ హంట్‌(టామ్‌) అనే గూఢచారి దానిని ఎలా అడ్డుకున్నాడు? ప్రపంచాన్ని ఎలా కాపాడాడు? అన్నదే కథ!

ఎలా ఉందంటే: గత ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ చిత్రాలకు కాస్త భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. కాన్సెప్ట్‌ కాస్త పాతదైనా ప్రేక్షకుడిని మాత్రం నిరాశ పరచదు. అయితే, కథా నేపథ్యం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటి వరకూ ముడులను వేసుకుంటూ వెళ్లిన దర్శకుడు, ఎప్పుడైతే కథానాయకుడు ఆ ముడులను విప్పడం ప్రారంభించాడో కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ ప్రేక్షకుడిని కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. విలన్‌ అండ్‌ కో పై ఒకసారి కథానాయకుడు పైచేయి సాధిస్తే, మరోసారి వాళ్ల వంతు. ఇలా దర్శకుడు స్క్రీన్‌ప్లే పట్టు సడలకుండా నడిపాడు. మరోపక్క యాక్షన్‌ ప్రియులను మంత్రముగ్ధులను చేసే స్థాయిలో సన్నివేశాలను తీర్చిదిద్దాడు. ఒకరిని అంతమొందించడానికి మరొకరు పరుగులు పెడుతూనే ఉంటారు. అందుకు కార్లు, మోటార్‌సైకిళ్లు ఆఖరికి హెలికాప్టర్లు ఇలా ఛేజింగ్‌ కోసం వినియోగించని వాహనం లేదంటే అతిశయోక్తి కాదు. మంచు కొండల్లో హెలికాప్టర్‌పై చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. గత చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, ఆరో చిత్రంగా వచ్చిన ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌’ మరో ఎత్తు అనే చెప్పాలి.

ఎవరెలా చేశారంటే: ఎప్పటిలాగే ఈథన్‌ హంట్‌ అనే గూఢచారి పాత్రలో ప్రపంచాన్ని రక్షించే బాధ్యతను తన భుజంపై వేసుకున్నాడు టామ్‌. విపత్కర పరిస్థితుల నుంచి అప్పటికప్పుడు బయటపడగల సమర్థ గూఢచారిగా తన నటనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. ఇక యాక్షన్‌ సన్నివేశాలకు ఈ సిరీస్‌ పెట్టింది పేరు. టామ్‌ వాటి కోసం ప్రాణం పెట్టాడనే చెప్పాలి. ఒక సన్నివేశంలో కాలు విరిగినా, ఆ బాధను పంటి బిగువున పెట్టి, దాన్ని పూర్తి చేశాడు. టామ్‌ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

యాక్షన్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలకు సంగీతం ప్రధాన బలం. లార్నీ బాల్ఫీ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్‌ రాబ్‌ హార్డీ గురించి. యాక్షన్‌ సన్నివేశాలను చాలా చక్కగా చూపించాడు. హెలికాప్టర్లలో జరిగే ఫైట్‌ ప్రేక్షకుడిని మరింత ఉత్కంఠకు గురి చేస్తుంది. 178 బిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టారని అధికారికంగా చెబుతున్నా, టామ్‌కు ప్రమాదం కారణంగా మరో 88 మిలియన్‌ డాలర్లను అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని హాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆ రిచ్‌నెస్‌ తెరపై కనిపిస్తుంది. దర్శకుడు గత చిత్రాలకు కాస్త భిన్నంగా ఒక థ్రిల్లింగ్‌ కథాంశాన్ని ఎంచుకున్నాడు. ప్రారంభంలో కాస్త తడబడినా, ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లిన తర్వాత ఆ వేగాన్ని చివరి వరకూ కొనసాగించడంతో ఒక మంచి యాక్షన్‌ సినిమా చూశామన్న భావనను ప్రేక్షకుడికి కలిగించాడు.

బలాలు
+ కథా నేపథ్యం
+ టామ్‌ నటన
+ యాక్షన్‌సన్నివేశాలు

బలహీనతలు
– ప్రథమార్ధంలో కొద్దిసేపు

చివరిగా: యాక్షన్‌ ప్రియులకు అద్భుతమైన ట్రీట్‌ ‘మిషన్‌ ఇంపాసిబుల్‌: ఫాలౌట్‌’

Related posts

Leave a Comment