బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం :తలసాని

latest bonaala 2018 festival news
  • జులై 15 వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు బోనాలు
  • వచ్చే నెల 15 వ తేదీ నుండి గోల్కొండ బోనాలు
  • విస్తృతంగా ఏర్పాట్లు
  • సమీక్షా సమావేశం నిర్వహించిన తలసాని

తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. వచ్చే నెల 15 వ తేదీ నుండి గోల్కొండ బోనాలు ప్రారంభమైతాయని ఆయన అన్నారు. ఈరోజు సచివాలయంలోని తన చాంబర్ లో గోల్కోండ బోనాల నిర్వహణ పై ఆ ప్రాంత కార్పోరేటర్లు, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… జులై 15 వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు బోనాల ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. జులై 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తొట్టెల రథము ఊరేగింపు లంగర్ హౌస్‌ నుండి బంజరి దర్వాజ, చిన్నబజారు ల మీదుగా గోల్కొండ వరకు జరుగుతుందని వివరించారు. జులై 15 వ తేదీన మొదటి పూజ, 19 న రెండవ పూజ, 22 న మూడవ పూజ, 28 న నాల్గవ పూజ, 29 న ఐదవ పూజ, ఆగస్టు 2 వ తేదీన ఆరవ పూజ, 5 న ఏడవ పూజ, 9 న ఎనిమిదవ పూజ, 14 వ తేదీన తొమ్మిదవ పూజ జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా బోనాలను ఘనంగా నిర్వహించేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తలసాని చెప్పారు. త్వరలో గోల్కోండ బోనాల నిర్వహణ ఏర్పాట్లపై అన్నిశాఖల అధికారులతో శ్రీ జగదాంబ మహంకాళీ దేవస్థానం వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

గోల్కొండ ఆలయ కమిటీ పదవీకాలం ముగిసినందున నూతన కమిటీని ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కమిషనర్ శివశంకర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, కార్పోరేటర్లు మిత్రీకృష్ణ, బంగారి ప్రకాష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శేఖర్ యాదవ్, సభ్యులు పుష్ప, పల్లవి, వసంతరెడ్డి, వినోద్, ఈవో మహేందర్, సలహాదారులు జీవన్ సింగ్, కావూరి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment