గంట చార్జింగ్.. 100 కి.మీల జర్నీ

-ఎలక్ట్రిక్ వాహనాలతో చౌకైన, కాలుష్యరహిత ప్రయాణం
-విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
-హైదరాబాద్‌లో విస్తరిస్తున్న చార్జింగ్ స్టేషన్లు
-త్వరలో ఈ-వెహికిల్ పాలసీ

చౌకైన, కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ సిద్ధమవుతున్నది. కాలుష్యభూతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరువతో నగరంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలు తెచ్చేందుకు సిద్ధమవుతుండగా, హైదరాబాద్ మెట్రోరైలు కూడా లాస్ట్ అండ్ ఫస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా విద్యుత్ కార్లను సిద్ధం చేస్తున్నది. దీనికి తగినట్టుగా హైదరాబాద్‌లో చార్జింగ్ స్టేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. మెట్రోరైలు సంస్థ ఇప్పటికే మియాపూర్‌లో బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేసింది. ప్రతి మెట్రోస్టేషన్ వద్ద ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. శంషాబాద్ విమానాశ్రయంలో కరంటు చార్జింగ్ స్టేషన్ ఉన్నది. దీనికి అనుసంధానంగా ఎలక్ట్రికల్ కార్లు ట్యాక్సీల రూపంలో నడుస్తున్నాయి. వ్యక్తిగత విద్యుత్ వాహనాలు కూడా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బేగంపేట, రాజ్‌భవన్ రోడ్డులో రెండు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసింది. త్వరలో పంజాగుట్ట, గచ్చిబౌలి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు తేవడానికి సిద్ధమవుతున్నది.

కిలోమీటర్‌కు రూ.2.25 మాత్రమే!
బేగంపేటతోపాటు రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్లలో కారును గంటపాటు చార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఐవోసీ ప్రతినిధి హర్ష తెలిపారు. వేగంగా చార్జ్ అయ్యేలా ఏర్పాటుచేశామన్నారు. గంట చార్జింగ్ చేస్తే రూ.125 వసూలు చేస్తామని చెప్పారు. సగటున పెట్రోల్ కారుకు కిలోమీటరుకు రూ.4.50 ఖర్చయితే.. కరంటు కారుకు కేవలం రూ.2.25 మాత్రమే అవుతుందన్నారు. నగరంలో తిరిగే ట్యాక్సీలకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ సంపాదించే వీలుందని చెప్పారు. వ్యక్తిగత వాహనాలకు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకోవచ్చన్నారు.

ఆన్‌లైన్ చెల్లింపులు
ఈ చార్జింగ్ స్టేషన్లలో చెల్లింపులన్నీ ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి ఉం టుంది. ఫార్చూం చార్జ్ అండ్ డ్రైవ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని అందులోని సూచనల ఆధారంగా చెల్లించాలి. ఒక చార్జింగ్ పిల్లర్ ద్వారా ఒకేసారి రెండు వాహనాలను చార్జింగ్ చేయవచ్చు. పెట్రోల్ బంక్‌లో మాదిరిగానే ఎంత చార్జింగ్ అయ్యింది? ఎంత చెల్లించాలో డిస్‌ప్లేలో కనిపిస్తుంది. మనకు కావాల్సిన దగ్గర ఆపేయొచ్చు. కొత్తగా వచ్చిన వాహనదారుల కోసం డిస్‌ప్లేలో సూచనలు ఉంటాయి. లేదా హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ-వెహికల్ పాలసీని తీసుకురానున్నది. దీంతో తక్కువ ఖర్చుతో ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అయితే మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధర 2లక్షల నుంచి 4 లక్షలు ఎక్కువగా ఉండటం, చార్జింగ్‌కు గంటల సమయం పట్టడం మైనస్‌లుగా మారాయి.
Tags: KTR , Hyderabad , Electric Vehicles , E Vehicle Policy , Electrical Charging Stations

Related posts

Leave a Comment