అభివృద్ధిలో మనదే అగ్రరాష్ట్రం

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ అగ్రరాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో నంబర్‌వన్‌గా ఉందని తెలిపారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులతో నవశకాన్ని నిర్మిస్తున్న రైతుబిడ్డ సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు తెచ్చిన తొలి సీఎం కేసీఆర్ అని చెప్పారు. గణేశ్, దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహించే యువత.. హరితహారంలో భాగస్వాములై మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది లో బుధవారం రైతుబీమా బాండ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మధ్యమానేరు జలాశయంలో 26 టీఎంసీల నీటిని నింపి, ఏడాది చివరికల్లా సాగునీరందిస్తామని చెప్పారు. ఈ దీపావళికే జిల్లాలో ఇంటింటికీ నల్లా నీరందిస్తామని స్పష్టంచేశారు.

రైతులకు అన్యాయాన్ని సహించబోం
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుపోతున్నదని, రైతులకు జరిగే అన్యాయాలను చూస్తూ ఊరుకోబోదని మంత్రి కేటీఆర్ అన్నారు. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువుల అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, కల్తీ వ్యాపారులపై గుండాచట్టం నమోదు చేస్తున్నామని గుర్తుచేశారు. సమైక్యపాలనలో తొమ్మిది గంటల విద్యుత్తు ఇస్తామని చెప్పి కనీసం ఆరుగంటలు కూడా ఇవ్వలేదని, ఆనాడు రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడించి, ధర్నాలు చేయాల్సి వచ్చేదని, ఎరువులను ఠాణాల్లో పెట్టి పంపిణీ చేసిన దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. నిరంతర విద్యుత్ ఇస్తామంటే రైతులే వద్దంటున్న పరిస్థితి ఇప్పుడు ఉందని, గత పాలనకు, కేసీఆర్ పాలనకు ఇదే తేడా అని చెప్పారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోరాదని రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారురు. అభివృద్ధిలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా నిలిపితే ప్రతిపక్షాల కండ్లకు కనిపించడం లేదని కేటీఆర్ విమర్శించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలు దగ్గరుండి ప్రతిపక్ష నేతలకు కండ్ల పరీక్షలు చేయించి, వారిలో మార్పు తీసుకురావాలని ప్రజలను కోరారు.
KTR , Rythu Bandhu Beema Bonds , Cm Kcr , Kanti Velugu

Related posts

Leave a Comment