అభివృద్ధికి శని కాంగ్రెస్

KTR , Cm Kcr , Srinivas Goud , Congress

-ఐటీ కారిడార్ నిర్మాణానికి రూ.50 కోట్లు
-30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
-65 ఏండ్ల పాలనలో పొలాలను బీళ్లుగా మార్చారు
-ఓటమి భయంతోనే ప్రాజెక్టులపై కేసులు
-ఉమ్మడి పాలమూరులో 14 లక్షల మంది వలసలకు బాధ్యులెవరు?
-మహబూబ్‌నగర్‌లో ఐటీ కారిడార్‌కు శంకుస్థాపన
-కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
-పెద్దచెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మిస్తామని హామీ

రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలతో రాష్ర్టాన్ని పచ్చగా మార్చాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అహరహం శ్రమిస్తుంటే, కోర్టుల్లో వందల కేసులు వేయించి కాంగ్రెస్ పార్టీ అడ్డుకొంటున్నదని, అన్ని వనరులున్న మహబూబ్‌నగర్‌ను ఆ పార్టీ వలసల జిల్లాగా మార్చిందని పేర్కొన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో ఏర్పాటవుతున్న ఐటీ కారిడార్‌కు శనివారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల కొలువులు లభిస్తాయని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకొంటున్న పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్‌రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో అభివృద్ధికి కాంగ్రెస్ శాపంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రాజెక్టులు, పథకాలతో పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తుంటే, కోర్టుల్లో కేసులువేస్తూ అడ్డుకొంటున్నారని విమర్శిం చారు. ఆరున్నర దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు పొలాలన్నింటినీ బీళ్లుగా మార్చాయన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 లక్షల మంది వలసలు వెళ్లడానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని దివిటిపల్లిలో శనివారం ఐటీ కారిడార్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ గతంలో పాలమూరును దత్తత తీసుకున్న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఏం ఒరగబెట్టారని నిలదీశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండి తన ప్రాంతానికి సాగునీరు తీసుకెళ్లడం తప్ప ఈ ప్రాంతానికిచేసిన అభివృద్ధి ఏమీలేదన్నారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలోనే పాలమూరు జిల్లాను కరువు, వలసలకు కేంద్రంగా మార్చారని విమర్శించారు. అన్ని వనరులున్న పాలమూరుకు 65 ఏండ్లకు పైగా సాగునీరు, కొలువులు లేకుండా చేశారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

ktr3

పాలమూరును పచ్చగా చేయడమే కేసీఆర్ సంకల్పం

పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించానన్న అభిమానంతో సీఎం కేసీఆర్ నేడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరులో 6 లక్షల ఎకరాలకు సాగునీరందించామని, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి వైద్యకళాశాల ఏర్పాటుచేయడంతోపాటు, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలుచేస్తుండటంతో ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్నదని చెప్పారు. కొల్లాపూర్, దేవరకద్రల్లో గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థుల ద్వారా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొంటున్నారని ఆరోపించారు. పాలమూరు గడ్డపైనుంచే అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకోవడంలేదా అని మంత్రి ప్రశ్నించారు. పాలమూరులో ఏర్పాటు చేస్తున్న ఐటీ కారిడార్ ద్వారా 15 వేల మందికి ప్రత్యక్షంగాను, మరో 15 వేల మందికి పరోక్షంగాను ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రూ.50 కోట్లతో ఐటీ కారిడార్ టవర్‌ను నిర్మిస్తామని, మరో రూ.24 కోట్లతో ట్యాంక్‌బండ్‌గా రూపుదిద్దుకొంటున్న పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్‌రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అవాంతరాలు ఎదురైనా ఐటీ కారిడార్ ఏర్పాటుకు కావవాల్సిన భూసేకరణలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొన్నారని అభినందించారు.

ktr4

కర్ణాటకలో కాపీ కొట్టారు..

రాష్ట్రంలో ప్రభుత్వం నాలుగు విడుతలుగా రూ.17వేల కోట్ల మేర రైతులకు రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లుగా డైలాగ్‌లు కొట్టారని, ఇప్పుడు మన పథకాన్ని కాపీకొట్టి విడుతలవారీగా కర్ణాటకలోనూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఒక నీతి.. తెలంగాణలో ఒక నీతిని ప్రదర్శిస్తున్నదని, చేతనైతే కర్ణాటకలో ఒకేసారి రుణమాఫీచేసి చూపెట్టాలని సవాల్ విసిరారు.

కుటుంబపాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్సే..

కుటుంబ పాలనకు కేరాఫ్‌గా మారి.. ప్రజలకు మొండిచెయ్యి చూపించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కుటుంబపాలన అంటూ పెడబొబ్బలు పెడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నాటి మోతీలాల్‌నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు దేశ ప్రజలను కబంధ హస్తాల్లో ఉంచుకుని కుటుంబపాలన సాగించిందెవరని ప్రశ్నించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రాధా అమర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కోరమోని వెంకటయ్య, జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షుడు బస్వరాజుగౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పీ రాములు, ఇంతియాజ్ ఇసాక్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ktr2

పెద్ద చెరువులో మంత్రి కేటీఆర్ బోటింగ్

మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ పర్యటన ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఐటీ కారిడార్‌కు శంకుస్థాపన, ఫైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరైన మంత్రి ముందుగా మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం 11.10 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రికి టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం దగ్గర రూ.33 కోట్లతో కూడిన వివిధ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి గడియారం చౌరస్తా ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మినీ ట్యాంక్‌బండ్‌గా పేరున్న పెద్దచెరువు వద్దకు చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు మినీ ట్యాంకుబండ్‌పై పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులను ఆత్మీయంగా పలుకరిస్తూ, కరచాలనంచేస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. చిన్నారులు కేటీఆర్‌పై పూలవర్షం కురిపించారు. పెద్దచెరువులోని బోటులో మంత్రులు, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ విహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తిమేరకు మినీ ట్యాంక్‌బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లను మంజూరుచేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ktr5

కర్ణాటకలో చేయలేనిది తెలంగాణలో ఎలా చేస్తారు?

-రుణమాఫీపై రెండు నాల్కల ధోరణి ఏమిటి?
-రాహుల్‌గాంధీకి మంత్రి కేటీఆర్ సూటిప్రశ్న
-తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఘాటుగా కౌంటర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అన్నదాతల పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. రైతు రుణమాఫీ విషయంలో ఆ పార్టీ.. రాష్ర్టానికో నినాదంతో ముందుకు సాగుతున్నదని, ఇది అన్నదాతలను మభ్యపెట్టడంగాక మరేమిటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కర్ణాటకలో రైతులకు నాలుగు విడుతల్లో రుణమాఫీ చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి విదితమే. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతోషాన్ని వ్యక్తంచేస్తూ.. కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ సర్కారుగా నిలుస్తుందని ట్వీట్‌చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వం తెలంగాణ విధానాన్ని అనుసరిస్తూ నాలుగు విడుతల్లో రుణమాఫీ చేస్తామని ప్రకటించిందని, ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు ఒకే విడుతలో రుణమాఫీ చేస్తామంటూ చిత్రవిచిత్రమైన హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒకే పార్టీ ఒక రాష్ట్రంలో చేయలేని పనిని మరో రాష్ట్రంలో ఎలా చేస్తుంది? తెలంగాణలో సాధ్యమయ్యే పని కర్ణాటకలో ఎందుకు సాధ్యంకాదు? అంటూ రాహుల్‌తోపాటు కాంగ్రెస్ నాయకులను కేటీఆర్ సూటిగా నిలదీశారు.

చేతగాని పాలకులవల్లే వలసలు

సమైక్యపాలనలో చేతగాని పాలకుల వల్లే పాలమూరు వలసలకు నిలయంగా మారింది. గడిచిన నాలుగేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాగునీరు, సంక్షేమ పథకాలు, విద్య, వైద్యపరంగా ఊహించని విధంగా ప్రజలకు సేవలందిస్తున్నాం. ఐటీ కారిడార్ మంజూరుకూడా వీటిలో భాగమే.
– లకా్ష్మ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

యువతకు బంగారు భవిష్యత్

ఇంతకాలం వలసలపై ఆధారపడ్డ పాలమూరు నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి మార్గాలను అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఐటీ కారిడార్‌ను పాలమూరుకు మంజూరు చేశారు. విమానాశ్రయానికి గంట వ్యవధిలోనే వెళ్లేలా పాలమూరు ఐటీ కారిడార్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు బంగారు భవిష్యత్ ఉంటుంది.
– జితేందర్‌రెడ్డి, ఎంపీ, మహబూబ్‌నగర్

జరుగుతున్న అభివృద్ధి పనులే నిదర్శనం

నాలుగేండ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులే సీఎం పాలనాదక్షతకు నిదర్శనం. దివిటిపల్లి ప్రాంతంలో ఇప్పటికే మెడికల్ కళాశాల, మరో 1200కు పైగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు, 300 ఎకరాల్లో మయూరి పార్క్, కర్వెన రిజర్వాయర్ లాంటివి అభివృద్ధికి సంకేతంగా నిలుస్తున్నాయి. ఐటీ కారిడార్‌ను మంజూరుచేసిన సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు.
– శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్

KTR , Cm Kcr , Srinivas Goud , Congress

Related posts

Leave a Comment