హైదరాబాద్ లో కలకలం… మూడు గంటల్లో 50 లక్షలు నొక్కేసిన నయా కి’లేడీ’లు!

kiladi lady
  • యాడ్ ఫిల్మ్ లో పిల్లలకు అవకాశాలంటూ ఆఫర్
  • ఆపై ఉచితంగా ఫొటో సెషన్
  • సెలక్టయ్యారంటూ చెప్పిన యువతులు
  • నమ్మి మోసపోయిన తల్లిదండ్రులు

మూడంటే మూడు గంటల వ్యవధిలో దాదాపు 100 మంది అమాయకపు తల్లిదండ్రుల నుంచి రూ. 50 లక్షలు నొక్కేశారు మాయ లేడీలు. అంతకుముందు హైదరాబాద్ లోని సుజనా ఫోరం మాల్ ను వేదికగా చేసుకుని గ్రౌండ్ వర్క్ చేశారు. కలకలం రేపిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, 26వ తేదీ శుక్రవారంనాడు సుజనా మాల్ లో చిన్న పిల్లలతో షాపింగ్ కు వెళ్లిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లిన కొందరు యువతులు, పిల్లలు బాగున్నారని, యాడ్ ఫిల్మ్ కు సరిపోతారని, ఒప్పుకుంటే, ఫొటో సెషన్ ఉచితంగా చేసి, యాడ్స్ సంస్థలతో కాంట్రాక్టులు కుదురుస్తామని చెప్పారు. వారి మాయమాటలకు పడిపోయిన వారు తమ ఫోన్ నంబర్లను వారికి ఇచ్చారు.

ఇక ఆ మరుసటి రోజే ఫోన్ నంబర్లు ఇచ్చిన వారందరికీ ఫోన్లు వెళ్లాయి. బంజారాహిల్స్ లోని ఓ ఫొటో స్టూడియోకు మీ పిల్లలను తీసుకుని రావాలని కోరారు. అక్కడికి దాదాపు 100 మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో హాజరుకాగా, ఫొటో సెషన్ నిర్వహించారు. ఆపై ఒక్కొక్కరినీ పిలిచి, 42 యాడ్ సంస్థలకు పిల్లలు ఎంపికయ్యారని, రెండేళ్ల కాంట్రాక్టుకు రూ. లక్ష, నాలుగేళ్లకు రూ. 2 లక్షలు, ఆరేళ్లకు రూ. 4 లక్షలు, ఎనిమిదేళ్లకు రూ. 6 లక్షలు తమకు కమిషన్ కట్టాలని, ఆపై మరింత మొత్తాన్ని సంపాదించుకోవచ్చని ఆశ పెట్టారు. వెతుక్కుంటూ వచ్చిన అవకాశమన్న భావనతో పలువురు డబ్బు చెల్లించారు.

ఆపై వారికి అసలు విషయం తెలిసింది. సదరు యువతులు కనిపించలేదు. ఆరా తీస్తే, స్టూడియోను రెండు రోజుల అద్దెకు తీసుకున్నారని తెలిసి, తాము మోసపోయామని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మూడు గంటల వ్యవధిలో ఫొటో సెషన్ చేసేసి, దాదాపు రూ. 50 లక్షల వరకూ వీరు దండుకున్నారని గుర్తించిన పోలీసులు, మాల్ సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఆ కిలాడీ యువతులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.

Related posts

Leave a Comment