జమిలికి జై ఏకకాల ఎన్నికలకు తెరాస మద్దతు

దీన్ని ముందస్తు ఎన్నికల చర్చగా పేర్కొనడం తగదు 
న్యాయ కమిషన్‌కు కేసీఆర్‌ రాసిన లేఖను అందజేసిన ఎంపీ వినోద్‌కుమార్‌ 
తెలుగు రాష్ట్రాలకు ‘జమిలి’ సమస్య లేదని అభిప్రాయం 
దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తెరాస మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈమేరకు భారత న్యాయ కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ బీఎస్‌చౌహాన్‌కు రెండు పేజీల లేఖ రాశారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై న్యాయ కమిషన్‌ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ తరఫున కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ఆదివారం హాజరయ్యారు. కేసీఆర్‌ లేఖను జస్టిస్‌ బీఎస్‌చౌహాన్‌కు అందించారు. ‘‘ప్రతిసారీ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల నిర్వహణకు 4 నుంచి 6 నెలల సమయం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రకారం అయిదేళ్లలో రెండుసార్లు ఎన్నికల కోసం కింది నుంచి రాష్ట్రస్థాయి వరకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవ్వాల్సి వస్తోంది. సుదీర్ఘకాలం పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంవల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలుగుతోంది. ఎన్నికలు ఒకేకాలంలో జరగకపోతే, అయిదేళ్లలో రెండుసార్లు ప్రజాధనంతో పాటు, పార్టీలు, అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రసమితి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి మద్దతిస్తోంది. ముందస్తు కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నందున నా తరఫున కమిషన్‌తో సంప్రదించి అభిప్రాయాలు చెప్పడానికి ఎంపీ బి.వినోద్‌కుమార్‌ను పంపుతున్నాను’’ అని కేసీఆర్‌ లేఖలో పేర్కొన్నారు.

Related posts

Leave a Comment