చీకటిని చీల్చుకుని! -గుహ నుంచి బయటపడ్డ నలుగురు థాయ్ బాలలు

Thailand , Cave , Wild Boars , Soccer Team

-గుహ నుంచి బయటపడ్డ నలుగురు థాయ్ బాలలు
-విజయవంతంగా తొలి దశ ఆపరేషన్
-ఆక్సిజన్ అయిపోవడంతో తొలిరోజు సహాయ చర్యలు నిలిపివేసిన రెస్క్యూ టీమ్
-నేడు మిగిలిన వారి తరలింపునకు తాజా ఆపరేషన్

రెండువారాలుగా చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న థాయ్‌లాండ్ బాలల్లో నలుగురిని సహాయ బృందాలు ఆదివారం వెలుపలికి తీసుకొచ్చాయి. అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ఆపరేషన్‌ను చేపట్టిన అధికారులు తొలి దశను విజయవంతంగా పూర్తిగా చేశారు. గుహలోపల ఆక్సిజన్ అయిపోవడంతో మొదటిరోజు సహాయ చర్యలను నిలిపివేశామని, మిగిలిన బాలలను బయటకు తీసుకొచ్చేందుకు సోమవారం తాజాగా ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. బాలలందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. వైల్డ్‌బోర్స్ అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలలు, వారి కోచ్ ఓ కొండగుహలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.మాయి సాయి, జూలై 8: గత పక్షం రోజులుగా చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన థాయ్‌లాండ్ బాలలు ఒక్కరొక్కరుగా వెలుపలికి వస్తున్నారు. ముందుగా ఆరోగ్యంగా ఉన్న బాలలను తరలించామని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహిస్తున్న నరోంగ్‌సాక్ ఒసొట్టానకోర్న్ చెప్పారు. బయటకు వచ్చిన వారిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. మొదటి దశలో కనీసం ఆరుగురు బాలలనైనా బయటకు తీసుకురావాలని భావించినప్పటికీ నలుగురిని మాత్రమే తేగలిగామని థాయ్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలిపింది. వైల్డ్‌బోర్స్ అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఈ బాలలు గుహలోకి వెళ్లిన అనంతరం ఆకస్మికంగా వరదలు రావడంతో అక్కడే చిక్కుకుపోయారు. బాలలందరూ 11 నుంచి 17 ఏండ్లలోపు వారే కావడం, రోజులు గడుస్తున్నా వారిని వెలికి తీసుకువచ్చే ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారి స్థితిగతులపై ప్రపంచమంతా ఆసక్తిని కనబర్చింది.

బాలలందరూ సురక్షితంగా బయటపడాలని వారి తల్లిదండ్రులతోపాటు ఈ వార్త తెలిసిన వారందరూ కోరుకున్నారు. గుహలోపల నీరు తగ్గేవరకూ వేచి చూడాలని అధికారులు తొలుత నిర్ణయించారు. కానీ తిరిగి వరద ఉద్ధృతి పెరుగనుందని తెలియడంతో పరిస్థితి విషమించకముందే వారిని వెలుపలికి తీసుకురావాలని ఆదివారం తీర్మానించారు. థాయ్‌లాండ్‌కు చెందిన 40 మంది, విదేశీయులు 50 మంది గజ ఈతగాళ్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా వీరిలో 13 మందిని బాలల వద్దకు పంపించారు. అనేక వ్యయప్రయాసలకోర్చి నలుగురు బాలలను బయటకు తరలించిన అనంతరం 10 గంటల పాటు ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
thialand3

గుహ వద్ద ఏం జరిగింది?

వారం రోజులుగా గుహ ముఖద్వారం వద్ద వేచి ఉన్న మీడియా సిబ్బందిని, ఇతర వాలంటీర్లను అధికారులు దూరంగా వెళ్లాలని కోరారు. దీంతో బాలలను రక్షించే ఆపరేషన్‌ను అధికారులు ప్రారంభించనున్నారని వెల్లడైంది. ఇది నిర్ణయాత్మక దినం. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు బాలలు సిద్ధంగా ఉన్నారు అని నరోంగ్‌సాక్ పేర్కొన్నారు. బాలలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని, పరిస్థితులను ఎదుర్కొని వెలుపలికి వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ ఆపరేషన్‌కు అటు బాలలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా తమ అంగీకారం తెలిపారని అన్నారు.

తొందరపడటానికి కారణమేమిటి?

వర్షాలు తగ్గేవరకూ ఆ బాలలు గుహలోపలే ఉండాల్సి రావచ్చునని అధికారులు తొలుత అంచనా వేశారు. అనగా బాలలు భూగర్భంలోనే కనీసం రెండు నెలలపాటు ఉండాలి. లేదా వారిని వెలుపలికి తీసుకొచ్చేందుకు గుహకు పైనుంచి రంధ్రం చేయాలి, లేదా గుహకు మరోవైపు నుంచి లోపలికి ద్వారం ఏర్పరచాలి. కానీ థాయ్‌లాండ్‌లో వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమైంది. అనగా రానున్న రోజుల్లో వర్షతీవ్రత మరింత పెరుగుతుంది. అప్పుడు అన్నిరకాల పనులకు ఆటంకం ఏర్పడుతుంది. గుహలోపలికి మార్గాలు ఏర్పరచేలోపే నీరు బాలలున్న ప్రదేశం వరకూ వెళ్లే ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు గత వారం రోజులుగా గుహలోపల ఉన్న నీటిని సాధ్యమైనంత మేరకు బయటకు తోడిపోశారు. ప్రస్తుతం గుహలో అత్యంత తక్కువ స్థాయిలో నీరు ఉన్నదని, బాలలను బయటకు తీసుకొచ్చేందుకు ఇదే అనువైన సమయమని నరోంగ్‌సాక్ చెప్పారు. ఈ అవకాశాన్ని కోల్పోకూడదనే ఆపరేషన్‌ను మొదలుపెట్టామని తెలిపారు.

సర్వత్రా ఉత్కంఠ

గుహలో చిక్కుకున్న బాలలను వెలికితీసే ఆపరేషన్ ప్రారంభమైందని తెలియగానే వారి క్షేమం కోరుకున్న అనేక మంది ప్రజలు ఆదివారం నాడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లోపల బాలలందరూ సజీవంగా ఉన్నారని తెలియడంతో వారం రోజులుగా భారీ ఎత్తున ప్రజలు గుహ వద్దకు తరలివస్తున్నారు. ఆదివారం వారిని వెలుపలికి తెచ్చే ఆపరేషన్ మొదలైందని తెలియడంతో జనం సంఖ్య మరింత పెరిగింది. బయటకు వచ్చిన బాలలను వెంటనే దవాఖానలకు తరలించేందుకు హెలికాప్టర్లను, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. ఒక్కో బాలుని కోసం ఒక్కొక్కటి చొప్పున 13 వైద్య బృందాలు, 13 హెలికాప్టర్లతో సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క బాలుడు వెలుపలికి వస్తున్న కొద్దీ వారి తల్లిదండ్రులు, స్నేహితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అభినందన సందేశాలతో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి.

లోపలికి ఎందుకు వెళ్లారు?

వైల్డ్‌బోర్స్ అనే ఫుట్‌బాల్ జట్టుకు చెందిన ఈ బాలలందరికీ ఆ ప్రాంతం సుపరిచితమే. మొదటిసారి వారు జూన్ 12వ తేదీన తమలో ఒకని పుట్టినరోజు వేడుకను జరుపుకొనేందుకు గుహలోపలికి వెళ్లారు. రెండోసారి జూన్ 23న తమవెంట ఆ రోజుకు సరిపడ ఆహారాన్ని మాత్రమే వారు తీసుకెళ్లారు. అన్వేషణ సాగిస్తూ ముందుకైతే వెళ్లారు గానీ వెనక్కి తిరిగి రావాలనుకునే సమయానికి మార్గమంతా నీటితో నిండిపోయింది. దీంతో బయటి ప్రపంచంతో వారికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

ఆపరేషన్ ఎందుకు నిలిపివేశారు?

గుహలోపల మిగిలి ఉన్న బాలలు, వారి కోచ్‌ను రక్షించేందుకు ఆపరేషన్‌ను తాజాగా మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. గుహలోపలికి తాము తీసుకెళ్లిన ఆక్సిజన్ ట్యాంకులన్నీ ఖాళీ అయిపోయాయని, కొత్త వాటిని తరలించాల్సి ఉందని తెలిపారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆపరేషన్‌ను మళ్లీ ప్రారంభించేందుకు పరిస్థితులు అనుకూలించాలని అన్నారు. మిగిలిన తొమ్మిది మందిని ముగ్గురేసి బాలల చొప్పున మూడు బృందాలుగా వెలుపలికి తీసుకొస్తామని చెప్పారు.
thialand5

బాలలను ఎలా తీసుకొచ్చారు?

బాలలు గుహనుంచి బయటకు రావడానికి చేసిన ప్రయాణం ఒక సాహసయాత్రగా చెప్పాలి. లోపలికి ఎలా వెళ్లారో తెలియదు గానీ బయటకు రావడానికి మాత్రం అడుగడుగునా వారు గండాన్ని ఎదుర్కొన్నారు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇటువంటి సన్నివేశాలు బాలలకు నిజజీవితంలో ఎదురుకావడం, వారు వాటన్నింటిని అధిగమించి బయటపడటం, అందుకు వారు చూపిన మనోధైర్యం ఎంతైనా అభినందనీయం. గుహ ముఖద్వారం నుంచి బాలలున్న ప్రదేశానికి మధ్య దూరం నాలుగు కిలోమీటర్లే అయినప్పటికీ, ఎంతో అనుభవజ్ఞులైన గజ ఈతగాళ్లు సైతం అక్కడికి వెళ్లి రావడానికి 11 గంటలు పడుతున్నది. లోపల కొంత దూరం నడవాలి. మరికొంత పూర్తిగా నీటిలోపల ఈదాలి. ఆ తరువాత కొంతదూరం ఎత్తయిన ప్రదేశానికి ఎగబాకాలి. అక్కడి నుంచి మళ్లీ నీటి అడుగున ఈదాలి. పైనుంచి కిందకు వస్తుండగా ఒక చోట టి జంక్షన్ వస్తుంది. అందులో ఒకవైపు రావడానికి బదులు మరో వైపు వెళితే ఇక అంతే సంగతులు. చిమ్మచీకటిలో ఈ విషయాన్ని గమనంలో ఉంచుకొని సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. మార్గం మధ్యలో ఒక ఇరుకైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం వ్యాసార్థం 15 అంగుళాలు మాత్రమే. ఆ ప్రదేశం నుంచి బయటపడాలంటే వీపుకున్న ఆక్సీజన్ సిలిండర్‌ను తీసి చేతితో పట్టుకొని ముందుకెళ్లాలి.ఇన్ని ఆటంకాలను అధిగమించిన తరువాత ఒక పెద్ద గుహలోపలికి వారు ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఒక మైలు దూరం నడిస్తే ముఖద్వారం వద్దకు వస్తారు. ఈ మొత్తం మార్గం ఎంత ప్రమాదకరం అంటే థాయ్‌లాండ్ నౌకా దళానికి చెందిన ఓ మాజీ ఈతగాడు ఆ గుహలోపలికి వెళ్లి ఊపిరాడక మరణించాడు. బాలలకు ఆక్సిజన్ అందించి వెనుకకు వస్తుండగా, అతడు నీట మునిగి స్పృహ కోల్పోయాడు. అతడు మళ్లీ మేల్కొనలేదు. ఇంత కఠినమైన మార్గంలో ఒక్కో బాలునికి సాయంగా ఇద్దరేసి ఈతగాళ్లను పంపారు. బాలల ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌లను పెట్టారు. వారికి ఆక్సిజన్ సరఫరా చేసే సిలిండర్లను ఈతగాళ్లు మోసుకొచ్చారు. ఈ కసరత్తునంతా ఈతగాళ్లు కొన్ని రోజుల పాటు రిహార్సల్స్ వేశారు. ఇక బాలలెవరికీ డైవింగ్ (నీటిలోపల ఈదటం) అనుభవం లేదు. కొందరికి అసలు ఈతనే రాదు. వారం రోజులుగా వారికి ముఖానికి ఆక్సిజన్ పెట్టుకొని నీటిలో ఈదటం నేర్పించారు.

TAGS :Thailand , Cave , Wild Boars , Soccer Team

Related posts

Leave a Comment