ఈరోజే పుట్టింది ‘భాగమతి’

bhagamathi latest teaser

మిగిలిన కథానాయికలతో పోలిస్తే అనుష్క కెరీర్‌ ముందు నుంచీ వైవిధ్యంగానే సాగుతోంది. ఓవైపు కమర్షియల్‌ కథల్లో కనిపిస్తూ, మరోవైపు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో మెరుస్తూ… సమతౌల్యం చూపిస్తోంది. అందుకే ఆమె ఖాతాలో ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలు చేరాయి. ‘భాగమతి’ కూడా ఈ జాబితాలో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆ చిత్రబృందం ధీమాగా చెబుతోంది. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘భాగమతి’. అశోక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. మంగళవారం అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోమవారం ‘భాగమతి’ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఓ చేతిలో ఆయుధం ఉంటే, మరో చేతికి శిలువ వేశారు. విరబోసిన జుత్తుతో అనుష్క రూపం చూస్తుంటే.. కచ్చితంగా మరో థ్రిల్లర్‌ రాబోతోందనిపిస్తోంది. ‘‘చక్కటి కథతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. కళా దర్శకుడు రవీందర్‌ రూపొందించిన సెట్స్‌, మది కెమెరా పనితనం, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇదివరకెప్పుడూ చూడని సరికొత్త అనుష్కని ‘భాగమతి’లో చూడబోతున్నార’’ని నిర్మాతలు చెప్పారు. ‘‘అనుష్క నటనకు అబ్బురపోవాల్సిందే. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంటుంది. థ్రిల్‌, సస్పెన్స్‌ కలబోసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొంటుందన్న నమ్మకం ఉంద’’న్నారు దర్శకుడు. ఉన్నిముకుందన్‌, జయరాజ్‌, ఆశాశరత్‌, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

bhagamathi latest teaser

Related posts

Leave a Comment