రాష్ట్ర నూతన ఏజీగా బీఎస్ ప్రసాద్

banda shivananda prasad appointed as telangana new advocate general

తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా బండా శివానందప్రసాద్ (బీఎస్ ప్రసాద్) నియమితులయ్యారు. ఏజీగా బీఎస్ ప్రసాద్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించడంతో.. న్యాయశాఖ కార్యదర్శి వీ నిరంజన్‌రావు శుక్రవారం నియామక ఉత్తర్వులను జారీచేశారు. వెనుకబడినవర్గాలకు చెందిన వ్యక్తి ఏజీగా నియమితులుకావడం 70 ఏండ్ల హైకోర్టు చరిత్రలో ఇదే ప్రథమం. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా ఏజీగా బీసీలకు అవకాశం దక్కలేదు. బీసీని ఏజీగా నియమించడంపై సీఎం కేసీఆర్‌కు న్యాయవాదవర్గాలు, బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

బ్యాంకింగ్ కేసుల వాదనలో దిట్ట బీఎస్
బీఎస్ ప్రసాద్ 1963 జూలై 31న పూర్వ వరంగల్ జిల్లా జనగామ ప్రాంతంలోని లద్నూర్ గ్రామంలో జన్మించారు. ప్రసాద్ తండ్రి శ్రీహరి సబ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాఠశాల విద్య సమయంలో ప్రసాద్ కుటుంబం హైదరాబాద్‌కు తరలివచ్చింది. డిగ్రీ అనంతరం ఓయూ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యాయవాదిగా 1987 జనవరి 30న ఎన్‌రోల్ అయిన తర్వాత సీనియర్ న్యాయవాది త్రివిక్రమ్‌రావు వద్ద అప్రెంటీస్‌గా పనిచేశారు. తర్వాత సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించి.. సివిల్, బ్యాంకింగ్ కేసులతోపాటు హైకోర్టులో రిట్ పిటిషన్ల దాఖలులో పేరుగాంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాది (వైద్య, ఆరోగ్యశాఖ)గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసాద్ సతీమణి మాధవి సైతం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు.

ఏజీగా అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు: బీఎస్ ప్రసాద్
అడ్వకేట్ జనరల్‌గా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు బీఎస్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏజీగా వెనుకబడినవర్గాలకు అవకాశమివ్వడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. అత్యున్నత పోస్టుకు ఎంపికచేస్తూ.. తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తానన్నారు. ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపిస్తానని తెలిపారు.

పలు సంఘాల హర్షం
బీసీవర్గాలకు చెందిన ప్రసాద్‌ను ఏజీగా నియమించడం పట్ల తెలంగాణ న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ, లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్, బీసీ సంఘాలు హర్షం ప్రకటించాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతుందని చెప్పిన కేసీఆర్.. తన హామీలను ఆచరణలో పెట్టారని లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం నగర కార్యదర్శి గొరిగె మల్లేశ్‌యాదవ్ పేర్కొన్నారు. హైకోర్టు చరిత్రలోనే తొలిసారి బీసీలకు అవకాశం ఇవ్వడంపై న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు శ్రీరంగారావు, కే గోవర్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన 16 మంది ఏజీలు ఆంధ్రకు చెందినవారేనని, ఉద్యమం తర్వాతే 17వ ఏజీగా తెలంగాణకు చెందినవ్యక్తిని నియమించారని పేర్కొన్నారు.

ఆర్ కృష్ణయ్య హర్షం
ఏజీగా బీసీ వర్గానికి చెందిన బీఎస్ ప్రసాద్‌ను నియమించడం పట్ల జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రశంసించారు. ఇందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
TAGS:Lawyer,banda shivananda prasad, telangana, advocate general, prakash reddy, highcourt ,

Related posts

Leave a Comment