అన్న చట్టసభల్లో.. తమ్ముడు చర్లపల్లిజైల్లో..

crime news in hyderabad city
  • నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్‌ సోదరుడు అజ్గర్‌హుస్సేన్‌ రిమాండ్‌
  • నకిలీ పత్రాలతో స్థలం ఆక్రమించి విక్రయం 

హైదరాబాద్: నకిలీ పత్రాలతో ఇతరుల స్థలాన్ని ప్లాట్లుగా చేసి అక్రమంగా విక్రయించిన  నాంపల్లి ఎమ్మెల్యే సోదరుడితోపాటు మరో వ్యక్తిని మైలార్‌దేవుపల్లి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌పెక్టర్‌ జగదీష్‌ కథనం ప్రకారం.. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్‌ సోదరుడు అజ్గర్‌ హుస్సేన్‌ ముజాహిద్‌(44) 2009లో హోటల్‌ వ్యాపారంలో బాగా నష్టపోయాడు. దీంతో ఇతరుల స్థలాలను ఆక్రమించుకుని విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం రచించాడు. తన స్నేహితుడైన మలక్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ముందుండే డాక్యుమెంట్‌ రైటర్‌ నయీముద్దీన్‌తో కలిసి స్థలాలపై ఆరాతీశాడు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు పక్కనే ఉన్న 94, 95బై2లోని 1519 గజాల స్థలంపై వారి కన్ను పడింది. ఆ స్థలం యజమాని మెహిదీపట్నంకు చెందిన మహ్మద్‌ అస్లంగా గుర్తించాడు. నయీమ్‌తో కలిసి ఆ స్థలం తనపేరుపై ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ స్థలాన్ని ఆరు ప్లాట్లుగా విభజించి వేరు వేరు పేర్లతో మూసాపేటలోని కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. ఆపై తన మిత్రుడైన మెహిదీపట్నానికి చెందిన మహ్మద్‌ ఇబ్రహీంకు రూ.90లక్షలకు విక్రయించాడు. కాగా స్థలం అసలు యజమాని మహ్మద్‌ అస్లం విదేశాల్లో ఉంటాడు. 2017లో నగరానికి వచ్చిన ఆయన తన స్థలం వద్దకు రాగా అది మరొకరి ఆధీనంలో ఉందని గుర్తించి.. ఆరా తీయగా నకిలీ పత్రాలతో విక్రయించినట్లు గుర్తించాడు. అనంతరం మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌ దర్యాప్తు చేపట్టి.. ఎమ్మెల్యే సోదరుడు అజ్గర్‌హుస్సేన్‌తోపాటు అతనికి సహకరించిన సయ్యద్‌ మేరాజ్‌లను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఫోర్జరీ పత్రాలకు సహకరించిన వారితో పాటు ఎక్కడెక్కడ ఎలా పత్రాలు తయారు చేశారన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Related posts

Leave a Comment