72గంటలు..1500కిమీ.. రైల్లోనే మృతదేహం

రైల్లోని బాత్రూంలో ఓ వ్యక్తి చనిపోతే మూడు రోజుల పాటు ఎవ్వరూ గుర్తించని దారుణ ఘటన పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో చోటుచేసుకుంది. మృతదేహం దాదాపు 72 గంటల పాటు 1500కిలోమీటర్లు రైల్లోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ప్రయాణికులు గానీ, ఇటు రైల్వే సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది గానీ ఎవ్వరూ కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అనే వ్యక్తి మే 24న ఉదయం 6 గంటలకు పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కారు. ఆగ్రాలో వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఏసీ 3-టైర్‌ కోచ్‌లో కూర్చున్నారు. సుమారు ఉదయం 7.30 గంటల సమయంలో ఆయన భార్య ఫోన్‌ చేసి ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించారు. కొంచెం నలతగా ఉందని వీలైతే ముందే ఎక్కడైనా దిగేస్తానని ఆమెకు చెప్పి సంజయ్ ఫోన్‌ పెట్టేశారు.

తర్వాత ఆమె ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్విచాఫ్‌ వచ్చింది. ఆయన ఆగ్రాకు వెళ్లలేదని తెలుసుకుని సంజయ్‌ భార్య రైల్వే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చివరకు ఆయన ఆఖరుగా ఫోన్‌ మాట్లాడిన 72 గంటల తర్వాత బిహార్‌లోని పట్నా రైల్వే స్టేషన్‌లో పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైల్లోని బాత్రూంలో పోలీసులు సంజయ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఆయన తన భార్యతో ఫోన్‌ మాట్లాడిన అనంతరం బాత్రూమ్‌కి వెళ్లగా అక్కడే గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి మరణించారు. లోపలి నుంచి బాత్రూం గడియ పెట్టుకుని ఉండడంతో ఎవ్వరూ గమనించలేదని రైల్వే పోలీస్‌ విభాగం దర్యాప్తు అధికారి వెల్లడించారు.

సంజయ్‌ కుమార్‌ మృతదేహం పట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించింది. రైలు కోటాకు వెళ్లి తిరిగి మళ్లీ పట్నాకు చేరుకునే వరకు ఎవ్వరూ గుర్తించలేదు. బాత్రూంలు శుభ్రపరచాల్సిన సిబ్బంది, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సైతం పట్టించుకోలేదు. సంజయ్‌ భార్య రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు సరిగ్గా గాలించలేదు. సంజయ్‌ మృతదేహం తిరిగి కోటా నుంచి ఆగ్రా, కాన్పూర్‌ రైల్వే స్టేషన్ల గుండా ప్రయాణించి పట్నాకు చేరుకుంది. పట్నాలో రైలును శుభ్రపరిచేందుకు యార్డుకు పంపడంతో బాత్రూం నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని తలుపు తెరవగా సంజయ్‌ మృతదేహం బాత్రూంలో పడిపోయి ఉంది. ఆయన వద్ద ఉన్న ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు సంజయ్‌ను గుర్తించి కాన్పూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

సంజయ్‌ ఆచూకీ తెలియడం లేదని మే 24న మధ్యాహ్నమే పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయితే మే 26 ఉదయం వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని సంజయ్‌ బంధువు ఒకరు వాపోయారు. ఘటనపై పోలీసుల దర్యాప్తు అనంతరం అంతర్గత దర్యాప్తు చేపడతామని రైల్వే అధికారులు వెల్లడించారు. సంజయ్‌ భార్య రైలు నంబరు తప్పుగా ఇవ్వడంతో ఆయనను గుర్తించడంలో మరింత ఆలస్యమైందని తెలిపారు. సంజయ్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదులో రైలు నంబరు 13237 అని తెలిపారని, అయితే ఆయన మృతదేహం లభ్యమైన రైలు నంబరు 13239 అని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Related posts

Leave a Comment