2019లో వచ్చే ప్రభుత్వం మాదే: పవన్‌ కల్యాణ్‌

జరుగుతోన్న మార్పులను చూస్తోంటే అలాగే కనబడుతోంది
పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు దోపిడీ చేస్తున్నారు
ఇక పార్టీ నేతలు దోపిడీ చేస్తుంటే మరొక పార్టీ నేతలు నిలదీయరు
అందుకే మూడో ప్రత్యామ్నాయం ఉండాలి
అన్ని నియోజక వర్గాల్లోనూ పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఒక పార్టీ నేతలు దోపిడీ చేస్తుంటే మరొక పార్టీ నేతలు నిలదీయరని, అందుకే మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని యలమంచిలిలో కొనసాగిస్తోన్న జనపోరాట యాత్రలో పవన్‌ మాట్లాడుతూ… 2019లో కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, జరుగుతోన్న మార్పులను చూస్తోంటే అలాగే కనబడుతోందని అన్నారు.

వేల కోట్ల ప్రభుత్వ ధనాన్ని దోచేస్తున్నా కొందరిపై కేసులు పెట్టట్లేదని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. చట్టవ్యతిరేకంగా జరుగుతోన్న మైనింగ్‌ మీద రోజుకి రూ.6 లక్షలు సంపాదిస్తోన్న స్థానిక ఎమ్మెల్యేపై కేసులు పెట్టరని వ్యాఖ్యానించారు. ప్రజల తరఫున అడగడానికే జనసేన ఉందని చెప్పారు. తాము 17,000 కిలోమీటర్లు రోడ్లేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని, ఇక్కడ చూస్తేనేమో కనీసం రైల్వే బ్రిడ్జి కూడా వేయలేదని, ఇంకెప్పుడు వేస్తారని ప్రశ్నించారు.

చివరికి రైల్వే బ్రిడ్జి ఏమయిపోయిందని, మందుబాబులు తాగే చోటులా తయారయిపోయిందని పవన్‌ అన్నారు. విశాఖపట్నానికి రైల్వే జోన్‌ కావాలన్నామని, అది వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించామని అది కూడా నెరవేరలేదని అన్నారు. యువతకి అండగా ఉందామని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. గత ఎన్నికల్లో ఏమీ ఆశించకుండా తాను టీడీపీకి మద్దతు తెలిపానని, తనకు ఏం చేస్తారని టీడీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడూ అడగలేదని, రాష్ట్ర యువతకి ఏం చేస్తారని అడుగుతున్నానని అన్నారు.

Related posts

Leave a Comment