2 అంశాలపై ఇంకా సమాచారం రాలేదని రాష్ట్రంపై నెపం

కడప ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. అదిగో ఇదిగో అంటూనే ఇంకా సమాచారం రావాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తోంది. స్పష్టమైన హామీ ఏదీ ఇవ్వడం లేదు. సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల ఆమరణ దీక్ష నేపథ్యంలో బుధవారం దిల్లీలో తెదేపా ఎంపీలు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌధురి బీరేంద్ర సింగ్‌ను కలిసినప్పుడూ ఆయన సానుకూలమేనన్నారు తప్పితే ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పలేదు. పైగా ఇంకా సమాచారం అందలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపైనే నెపం నెట్టే ప్రయత్నం చేశారు.

కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలన్న డిమాండుతో గత ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న తెదేపా ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎం రమేష్‌, బీటెక్‌ రవిల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పష్టమైన హామీ రాబట్టుకోవడానికి తెదేపా పార్లమెంటరీ పార్టీ బృందం బీరేంద్ర సింగ్‌ను కలిసింది. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ నాలుగు పేజీల వినతి పత్రం సమర్పించింది. వెంటనే విధాన ప్రకటన చేయాలని కోరింది. సుమారు గంటన్నరపాటు ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. కొంత ఆలస్యమైనప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తాము సానుకూలంగా ఉన్నామని, తనపై విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము అడిగిన సమాచారం అందిన వెంటనే తదుపరి కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు. అయితే కేంద్రం అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22నే పంపిందని, తమవైపు ఏమీ పెండింగ్‌ లేదని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ స్పష్టం చేశారు.

కానీ మంత్రి ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తాము మరింత స్పష్టత కోరామని చెప్పారు. ‘సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌కు సమాధానంగా మా శాఖ దాఖలు చేసిన అఫిడవిట్‌ గురించి ప్రసార సాధనాల్లో తప్పుగా ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్‌ ప్లాంటుకు తెరదించిందన్నట్లు ప్రచురించారు. అది తెలిసిన వెంటనే మేం వివరణిస్తూ ప్రకటన జారీచేశాం. ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటికీ కడప, బయ్యారంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకుగల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రెండు కమిటీలు చెప్పిన విషయాలనే మేం అఫిడవిట్‌లో ప్రస్తావించాం. ఆ తర్వాత మేం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. గత ఏడాది డిసెంబరులో టాస్క్‌ఫోర్స్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలపై వివరణ కోరింది. మేం అడిగిన కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే సమాధానం ఇచ్చింది. ఈనెల 22న భూమి, ఖనిజ లింకేజీ గురించి వారి నుంచి మరింత స్పష్టత కోరాం. ఈ రెండు అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన వెంటనే టాస్క్‌ఫోర్స్‌ నివేదికను పూర్తి చేయగలుగుతుంది.

ఆ తర్వాత కడపలో ప్లాంటు ఏర్పాటుపై తదుపరి కార్యాచరణ చేపట్టడానికి వీలవుతుంది. ఈ అంశంపై ఇప్పటివరకూ ఉన్న అపోహలన్నింటికీ మేం స్పష్టత ఇస్తున్నాం. అందువల్ల యువకులైన సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆందోళన విరమించాలి’ అని బీరేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. ‘ఈ నెల 22న మెకాన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందుబాటులో ఉన్న భూమిలో ప్రైవేటు భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంతో చెప్పాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం 1800 ఎకరాల భూమి ఇవ్వగలుగుతామని చెప్పింది. 1.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యమున్న ప్లాంటుకు ఆ భూమి సరిపోతుందని భావిస్తున్నా. తొలుత మెకాన్‌ నివేదిక ఇవ్వాలి? ఒక వేళ ప్లాంటు ఏర్పాటు చేస్తే సంప్రదాయ పద్ధతిలోనే ఉండాలా? లేదంటే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం వెళ్లాలా? అన్నది చూడాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ తరహా సాయం అందుతుందన్నది స్పష్టత రావాలి. ఇవేవీ లేకుండా ఎప్పుడు రిబ్బన్‌ కట్‌ చేస్తారని అడిగితే నేనేం చెప్పగలను. సీఎం రమేష్‌ నాకు మంచి స్నేహితుడు. ఆయన నా మాట విని దీక్ష విరమించాలి. నేను చెప్పిన దాంతో ఎంపీలంతా సంతృప్తి చెందారు’ అని కేంద్ర మంత్రి వివరించారు. మెకాన్‌ నివేదిక ఎప్పటిలోగా వస్తుందో చెప్పగలరా? అని గల్లా జయదేవ్‌ ప్రశ్నించగా.. ‘నాకు నివేదిక అందినప్పుడు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోగలనో చెప్పడానికి వీలవుతుంది. తొలుత ఏపీ ప్రభుత్వం నుంచి రెండు అంశాలపై సమాచారం రావాలి. మీరు స్పష్టమైన గడువు కావాలని అడుగుతున్నారు? కానీ నేను నా మాటపై నమ్మకం ఉంచండి అని కోరుతున్నా… అంతకు మించి ఏమీ చెప్పను. నేను విభిన్నమైన వ్యక్తిని. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి’ అని బీరేంద్ర సింగ్‌ పేర్కొన్నారు.

Related posts

Leave a Comment