12 ఏళ్ల కల.. సైరా

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా అన్న చర్చ ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచే ఈ కథను వెండితెరపైకి తేవాలని పరుచూరి సోదరులు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ‘సైరా’ రూపంలో వారి కల నెరవేరుతోంది.

దీని వెనుక ఉన్న కష్టం ఎలాంటిదో ‘సైరా’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఈ కథకు పునాది 12 ఏళ్ల కిందటే పడిందని అతను వెల్లడించాడు. ఈ పన్నెండేళ్లలో పరుచూరి సోదరులు తమ కుటుంబ సభ్యులతో చాలా సినిమాలు చేశారని.. తరచుగా తమ ఇంటికి వచ్చేవాళ్లని.. కథాచర్చలు జరిగేవని.. కానీ ఉయ్యాలవాడ కథ పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయం పట్టిందని చరణ్ తెలిపాడు.

తమ ఇంటికి వచ్చినపుడల్లా ఉయ్యాలవాడ కథ గురించి ప్రస్తావించి.. తన తండ్రికి ఈ సినిమా విషయంలో రికమెండ్ చేయమని అనేవారని.. కానీ నేను చెప్పడమేంటండీ అని అనేవాడిని చరణ్ తెలిపాడు. ఈ కథ పక్కాగా తయారు కాకపోవడం వల్లో.. లేక ఈ కథకు తగ్గ దర్శకుడు, టెక్నికల్ టీం దొరక్కపోవడం వల్లో.. దీనికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులో లేకో.. ఇంకేవైనా కారణాల వల్లో తెలియదు కానీ.. తన తండ్రి ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదని.. అయినప్పటికీ పరుచూరి సోదరులు మాత్రం ఆశలు వదులుకోలేదని చరణ్ తెలిపాడు.

ఐతే ఇప్పటికైనా ఈ సినిమా పట్టాలెక్కిందంటే అది పరుచూరి సోదరుల పట్టుదల వల్లే అన్నాడు. వారి నమ్మకం, సంకల్పమే ఈ సినిమా కార్యరూపం దాల్చేలా చేసిందని.. ఒక వ్యక్తి ఒక విషయం మీద అలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని చరణ్ అన్నాడు. ఈ కథను దర్శకుడు సురేందర్ రెడ్డి తన విజన్ కూడా జోడించి చిరుకు చెప్పాడని.. అప్పటిదాకా విముఖతతో ఉన్న చిరు.. ఒక్క సిట్టింగ్‌లో ఓకే చేసేశారని చరణ్ చెప్పడం విశేషం.

Tags: Sye Raa ,Sye Raa Narasimha Reddy, Paruchuri Brothers, Ramcharan

Related posts

Leave a Comment