11 జిల్లాల కలెక్టర్ల బదిలీ

ఆమ్రపాలికి పోస్టింగు ఇవ్వని ప్రభుత్వం
మంచిర్యాలకు ఎవరినీ నియమించలేదు
సంగారెడ్డి కలెక్టర్‌గా గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు
నేడు సీనియర్‌ అధికారులు, ఐపీఎస్‌ల బదిలీలు
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 11 మంది కలెక్టర్లున్నారు. వరంగల్‌ నగర కలెక్టర్‌ ఆమ్రపాలిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెకు పోస్టింగు ఇవ్వలేదు. మంచిర్యాలకు ఎవరినీ నియమించలేదు. హైదరాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణాను వైద్యఆరోగ్య శాఖ సంచాలకురాలిగా బదిలీ చేసింది. గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(గడా) ప్రత్యేకాధికారి ఎం.హన్మంతరావుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అవకాశం కల్పించింది.
సిరిసిల్ల కలెక్టర్‌ను సిద్దిపేటకు.. సిద్దిపేట కలెక్టర్‌ను సిరిసిల్లకు బదిలీ చేసింది. మరికొంత మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీపై బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు ఈ జాబితాలో ఉండనున్నారు. ఐపీఎస్‌లనూ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేయనుంది.

Related posts

Leave a Comment