హ‌రికృష్ణ‌కు సంబంధించి ఎవ‌రికి తెలియ‌ని విష‌యాలివి!

ఊహించ‌ని రీతిలో జ‌రిగిన ప్ర‌మాదంలో అసువులు బాసిన హ‌రికృష్ణ‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌విష‌యాలెన్నో ఉన్నాయి. అన్నింటికి మించి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలిసిన విష‌యాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న రోజువారీ దిన‌చ‌ర్య మొద‌లుకొని ఒత్తిడితో ఉన్న‌ప్పుడు ఏం చేసేవారు? అలాంటి వాటి వ‌ర‌కూ ఆయ‌న‌కు సంబంధించి పెద్ద‌గా తెలీని ఈ వివ‌రాల్ని చూస్తే..

– హ‌రికృష్ణ‌కు అబిడ్స్ లో ఆహ్వానం హెట‌ల్ ఉన్న‌ద‌న్న‌ది తెలిసిందే. ఆ హోట‌ల్లోని 1001 రూమ్ ఎవ‌రికి ఇచ్చేవారు కాదు. ఎందుకంటే.. హ‌రికృష్ణ అందులోనే ఉంటారు. కీల‌క నిర్ణ‌యాల‌న్ని అందులోనే తీసుకునే వారు. ఆయ‌న దిన‌చ‌ర్య సైతం అక్క‌డి నుంచే ప్రారంభ‌మ‌య్యేది. ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కూ హోట‌ల్లోని ఈ గ‌దికి చేరుకొని ముందుగా గ‌ది ఎదురుగా ఉండే వినాయ‌కుడి విగ్ర‌హానికి పూజ‌లు చేసి లోప‌ల‌కు వెళ్లేవారు. అనంత‌రం దిన‌ప‌త్రిక‌ల్ని కాసేపు చ‌దివి.. సేద తీరేవారు.

– మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఆయ‌న రోజువారీ జీవితం తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కే మొద‌ల‌య్యేది. అప్ప‌టి నుంచి క్ర‌మ‌ప‌ద్ద‌తిలో ఆయ‌న దిన‌చ‌ర్య ఉండేది.

– హ‌రికృష్ణ‌కు17ఏళ్లుగా సేవ‌లు అందిస్తున్నారు ర‌మ‌ణ‌య్య. హ‌రికృష్ణ తాగే కాఫీలో ఎంత చ‌క్కెర ఉండాలి? ఉద‌యం టిఫెన్ ఏం తింటారు? మ‌ధ్యాహ్నం భోజ‌నంలో ఏం ఉండాలి? ఏ టైంకి ఏ ఏ మందులు ఇవ్వాలో అవ‌న్నీ అత‌డే చూసుకునేవాడు. హోట‌ల్లోకి రాగానే కారులో ఉండే వాట‌ర్ బాటిల్స్ తీసుకెళ్ల‌టం. ఉద‌యం కామ‌త్ హోట‌ల్లో టీ తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది. అది తాగిన త‌ర్వాతే అల్పాహారం.

– టిఫిన్ కోసం టీ టైమ్ హోట‌ల్ నుంచి ఇడ్లీ తెప్పించుకుంటారు. ఉద‌యం 10 నుంచి 12 మ‌ధ్య‌లో కొద్దిమందితో స‌మావేశ‌మ‌య్యాక‌.. భోజ‌నం చేసేవారు. బీపీ.. షుగ‌ర్ కు సంబంధించిన మందులు వేసుకోవ‌టం.. కాసేపు టీవీ చూడ‌టం చేసేవారు.

– రాత్రి ఇంటికి వెళ్లే ముందు అర‌లీట‌రు జెర్సీ పాలు తాగ‌టం హ‌రికృష్ణ‌కు అల‌వాటు. ఒక‌వేళ ఒత్తిడిలో ఉంటే అబిడ్స్ లోని కేఎఫ్ సీ నుంచి చికెన్ లాలీపాప్ లు.. పాపాజి దాబా నుంచి తందూరీ చికెన్ తెప్పించుకునేవారు.

– ప్ర‌తి సోమ‌వారం సాయంత్రం నిమ్మ‌కాయ‌లు.. నాలుగు కొబ్బ‌రికాయ‌లు.. పూజాసామాగ్రి తెప్పించి ఇంటికి తీసుకెళ్లేవారు. ఇంటికి వెళ్లే ప్ర‌తిరోజూ.. ర‌మ‌ణ‌య్యా.. నేను వెళుతున్నా.. జాగ్ర‌త్త అని అప్యాయంగా చెప్పి వెళ్ల‌టం అల‌వాటు.

– హ‌రికృష్ణ‌కు జంతువులంటే ప్రాణం. ఆయ‌న ఆహ్వానం హోట‌ల్ పార్కింగ్ స్థ‌లంలో ప్ర‌త్యేకంగా జంతువులు పెంచేందుకు షెడ్డు ఏర్పాటు చేశారు. అందులో ఆవు.. రామ‌చిలుక‌.. పావురాళ్లు.. కోళ్లు.. కుందేళ్లు పెంచేవారు. వాటికి ఆహారం.. నీళ్ల‌ను ప్ర‌తిరోజూ ఏర్పాటు చేసేవారు.

– ఆవుకు పూజ‌లు చేయ‌టం.. టైం ఉంటే వ‌న‌స్థ‌లిపురంలో ఉన్న గోశాల‌కు వెళ్లి గోవుల‌కు పూజ‌లు చేసేవారు. నాలుగేళ్ల క్రితం కొడుకు మ‌ర‌ణం త‌ర్వాత ఆవేద‌న‌తో ఉన్న హ‌రికృష్ణ మూడు నెల‌లు హోట‌ల్ కు రాలేదు. ఆ టైంలో మూగ‌జీవాల అల‌నాపాల‌నా చూసేందుకు ఇబ్బందిగా ఉంద‌న్న విష‌యాన్ని తెలుసుకొని.. ఆవును గోశాల‌కు.. మిగిలిన ప‌క్షుల‌ను జూపార్కుకు పంపించేశారు.

– సీత‌య్య సినిమాలో హ‌రికృష్ణ వాడిన రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ ను అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అప్పుడ‌ప్పుడు దానిపై అబిడ్స్ లో చెక్క‌ర్లు కొట్టేవారు. పాన్ షాప్ కు వెళ్లి పాన్.. మిగిలిన వ‌స్తువులు స్వ‌యంగా కొనేవారు. ఎన్ ఫీల్డ్ మీద హ‌రికృష్ణ వెళుతుంటే.. సినిమాలో సీత‌య్య‌ను చూసిన‌ట్లే ఉండేది. ఇప్పుడా రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ ఆహ్వానం హోట‌ల్ వ‌ద్దే ఉంది.

– హైద‌రాబాద్ లో ఇన్ని మ‌ల్టీఫ్లెక్సులు.. థియేట‌ర్లు ఉన్నా.. అబిడ్స్ లోని తమ రామ‌కృష్ణ థియేట‌ర్లోనే ఎక్కువ‌గా సినిమాలు చూడ‌టం హ‌రికృష్ణ‌కు ఇష్టం. జూనియ‌ర్ ఎన్టీఆర్.. క‌ళ్యాణ్ రామ్ సినిమాల్ని ఆయ‌న రామ‌కృష్ణ థియేట‌ర్లోనే చూసేవారు. త‌న తండ్రి సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడు కూడా.. ఆయ‌న సినిమాల్ని రామ‌కృష్ణ థియేట‌ర్లోనే చూడ‌టం హ‌రికృష్ణ‌కు అల‌వాటు.

Related posts

Leave a Comment