హద్దులు దాటుతున్న సామాజిక మాధ్యమాల వినియోగం

చరవాణిలో యథేచ్ఛగా అభ్యంతరకర చిత్రాల షేరింగ్‌
బంధం బెడిసికొడితే ఆ దృశ్యాలే బ్లాక్‌మెయిల్‌ అస్త్రాలు
అసలే లేత వయసు… ఆపై విపరీతమైన ఆకర్షణ. అమ్మాయిని చూస్తే అబ్బాయికి.. అబ్బాయిని చూస్తే అమ్మాయికి వలపు పుట్టే ప్రాయం. అది ప్రకృతిసిద్ధమే అయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత కారణంగా ఆ వలపు తలపులు హద్దులు దాటుతున్నాయి. ఒకప్పుడు ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకునేందుకే జంకే పరిస్థితుల నుంచి.. ఇప్పుడు ఏకంగా చరవాణిలోనే గంటల తరబడి చాటింగ్‌ల్లో మునిగి తేలే వరకు వచ్చింది. అదెంతగా హద్దులు దాటిందంటే.. అమ్మాయి తన నగ్నత్వాన్ని అబ్బాయికి పంచేంతగా. అమ్మాయిల తల్లిదండ్రుల్లో వణుకు పుట్టించే ఈ విపరీత చర్య ఇప్పుడు యువత దృష్టిలో మంచినీళ్ల ప్రాయంగా మారింది. నోటు పుస్తకాల్ని ఇచ్చిపుచ్చుకున్నంత సులభంగా చరవాణిలోనే అభ్యంతరకర దృశ్యాల్ని మార్చేసుకుంటున్నారు. ఆ జంట మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణి బాగానే ఉంటున్నా.. ఒకవేళ బంధం బెడిసికొడితే మాత్రం పర్యవసానాలు పరువు తీసేవిగా తయారవుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మరో ఉదంతం బహిర్గతమైంది.

పెళ్లి ముంగిట ఉపద్రవం
మౌలాలి లాలాగూడలోని ఇందిరానగర్‌లో ఉండే ఇంజినీరింగ్‌ విద్యార్థి దొనావన్‌ లక్ష్మణ్‌సాయికి క్లాస్‌మేట్‌తో పరిచయం ఏర్పడింది. తరచూ మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఓరోజు లక్ష్మణ్‌సాయి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అమ్మాయి ఒప్పేసుకుంది. ఇంకేం.. వారి ప్రేమ హద్దులు దాటేసింది. అర్ధరాత్రి దాటేవరకు సెల్‌ఫోన్‌లో చాటింగ్‌లు ముమ్మరమయ్యాయి. వాట్సప్‌లో వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు పరస్పరం పంపించుకోవడం మొదలైంది. ‘నీ నగ్నదృశ్యాల్ని చూడాలని ఉంది.. పంపించు ప్లీజ్‌..’ అని లక్ష్మణ్‌సాయి గోముగా అడగ్గానే ఆ అమ్మాయి ప్రేమతో పంపించేసింది. అలా పంపించుకోవడం వారి మధ్య స్వరసాధారణమైంది. అది భవిష్యత్తులో తన పరువు తీస్తుందని ఆ అమ్మాయి గ్రహించలేకపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయికి లక్ష్మణ్‌సాయి నిజస్వరూపం తెలియవచ్చింది. అతడికి అప్పటికే చాలా మంది అమ్మాయిలతో వ్యక్తిగత సంబంధాలు విరివిగా ఉన్నాయని తెలిసింది. అంతే.. లక్ష్మణ్‌సాయికి ఆ అమ్మాయి బ్రేక్‌అప్‌ చెప్పేసి అతడిని మరిచిపోయింది. చాటింగ్‌లకు, సరదా సంభాషణలకు గుడ్‌బై చెప్పేసింది. లక్ష్మణ్‌సాయి మాత్రం అంత సులభంగా ఆ అమ్మాయిని మరిచిపోలేదు. సరికదా.. పగ ప్రతీకారంతో రగిలిపోయాడు. అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఈక్రమంలో ఇంజినీరింగ్‌ పూర్తయిపోవడంతో అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూశారు. ఓ అబ్బాయితో నిశ్చితార్థం జరిగిపోయింది. మరో రెండు నెలల్లో పెళ్లి చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో అమ్మాయి నగ్న దృశ్యాలను బయటికి తీశాడు లక్ష్మణ్‌సాయి. రెండు నకిలీ మెయిల్‌ ఐడీలు సృష్టించి వాటిలో నుంచి అమ్మాయి కాబోయే భర్తకు, ఆమె తండ్రికి ఆ దృశ్యాల్ని పంపించాడు. గుర్తు తెలియని నంబర్ల నుంచి అమ్మాయి తండ్రికి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబం రాచకొండ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్‌ జలేంధర్‌రెడ్డి దర్యాప్తులో రెండు రోజుల్లోనే లక్ష్మణ్‌సాయి నిర్వాకం బహిర్గతమైంది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు లక్ష్మణ్‌సాయి తన మెయిల్‌ ఐడీకీ ఆ నగ్న దృశ్యాల్ని పంపించుకొని అతి తెలివిని ప్రదర్శించినా.. ఇన్‌స్పెక్టర్‌ దర్యాప్తు ముందు అతడి ఆటలు సాగలేదు. బుధవారం లక్ష్మణ్‌సాయిని రిమాండ్‌కు పంపినా.. బాధితురాలి భవిష్యత్తు డోలాయమానంలో పడింది.

Related posts

Leave a Comment