స్వరాష్ట్రంలో తొలి ఎన్నికలు

తెలంగాణ ఏర్పడిన జూన్ 2, 2014 నాటికి.. ఇప్పటికీ పరిపాలనలో అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో ఏ ఉద్యోగులు ఎక్కడుంటారోకూడా తెలియని పరిస్థితి.. ఏ శాఖలున్నాయో.. వాటిని ఎవరు చూస్తారో.. ఎలా పనిచేయాలో తెలియని గందరగోళం ఉండేది. కానీ ఉద్యమ నేతగా.. ప్రజల కష్టసుఖాలను క్షేత్రస్థాయిలో తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీఎం కావడంతో.. తెలంగాణను సొంత కాళ్లపై నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిపాలను ప్రజల వద్దకు నడిపించారు. ప్రజల అవసరాలకు, సుపరిపాలనకు వీలుగా 10 జిల్లాలను కాస్తా.. 31 జిల్లాలుగా విభజించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసుకొని ప్రజాస్వామ్యం పూర్తిగా క్షేత్రస్థాయిలో కళకళలాడుతున్న సమయం ఇది. అదే సమయంలో సుపరిపాలన అందించేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని పటిష్ఠంగా, శాంతి భద్రతల సంరక్షణకు పోలీసు యంత్రాంగాన్ని బలోపేతంచేశారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలనైనా శాంతిగా, సంతృప్తికరంగా నిర్వహించే స్థాయికి తెలంగాణ చేరుకొన్నది.
రాజకీయ పునరేకీకరణ
ఆరు దశాబ్దాలుగా తెలంగాణను అణగదొక్కి.. దోచుకొని అభివృద్ధికి ఆమడ దూరం చేసిన రాజకీయ పార్టీల ప్రాబల్యంలో 2014 శాసనసభ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు జరిగే ఎన్నికలు మాత్రం ఇటు రాజకీయ పునరేకీకరణతోపాటు.. ప్రజలు రాజకీయంగా పూర్తి చైతన్యం పొందిన నేపథ్యంలో జరుగనున్నాయి. అసలు అభివృద్ధి అంటే ఏమిటి.. సంక్షేమం అంటే ఏమిటి.. అన్నవాటిని దేశానికి హేతుబద్ధంగా చాటిచెప్పిన సందర్భంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ వేదికవుతున్నది. నిజానికి 2014 ఎన్నికలు అనేక శాపనార్థాలు.. అనుమానాలు.. చిమ్మ చీకట్ల నడుమ.. తెలంగాణను మొదటి నుంచి దోచుకుంటున్న పార్టీల కనుసన్నల్లోనే జరిగాయి. అయితే ప్రజలు మాత్రం ఉద్యమ పార్టీపైనే నమ్మకంతో పాలనా పగ్గాలు అప్పగించారు. ఈ నాలుగేండ్లలో ప్రజలు సుపరిపాలన రుచిని చూశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అనుభవించారు. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో ఔపోసన పట్టారు. మనవారెవరు.. పరాయివారెవరనేది తేటతెల్లమయింది. ప్రజలు రాజకీయ చైతన్యం తెచ్చుకున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు.. దసరా పండుగను తలపిస్తున్నాయి. ఆటపై, ఆట నిబంధనలపై ఆటగాడికి పూర్తి అవగాహన ఉంటే ఆటగాడి సామర్థ్యం ఎలా బయటపడుతుందో.. అలాగే రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ ఫలితాన్ని చవిచూసిన ప్రజలు రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నారు. సొంత కాళ్లపై నిలబడ్డ తెలంగాణ ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు ఇప్పటికే ఆలోచించుకున్నారు. ఆ ఆలోచనలనే అమలుచేయనున్నారు.
Tags: Telangana , Assembly Elections ,CM KCR ,TRS Scheme

Related posts

Leave a Comment