స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి టీడీపీనే కారణం: కన్నా లక్ష్మీనారాయణ

కేంద్రం ఇచ్చిన ఆర్డర్ లో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదు
ప్లాంట్ సాధ్యం కాదని జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది
స్టీల్ ప్లాంట్ ను తీసుకొచ్చే బాధ్యత కేంద్రానిదే
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని జూన్ లో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పట్టుబట్టడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ మరోసారి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థలు కలసి నివేదిక అందజేస్తే… త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలలో ప్లాంట్ సాధ్యపడదు అని ఎక్కడా లేదని తెలిపారు.

మోస పూరిత చర్యలతో ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. టీడీపీ నేతలు నాటకాలు ఆపాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ కోసం టీడీపీ నేతలు ఎవరూ ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదని… కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు.

Related posts

Leave a Comment