‘సైరా’ సెట్ లో అమితాబ్ తో ‘మెగా’ హీరోలు.. బయటకొచ్చిన అరుదైన ఫొటో!

‘సైరా’లోని తమ పాత్రల గెటప్ లలో బిగ్ బీ, చిరంజీవి
ఆ ఫొటోలో పవన్ కల్యాణ్, రామ్ చరణ్
తాజాగా ఫొటో పోస్ట్ చేసిన సత్యానంద్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ‘మెగాస్టార్’ తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ‘సైరా’లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా నటిస్తున్నాడనే వార్తలతో ‘మెగా’ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఆ వార్తలు ఎంత వరకు వాస్తవమనే విషయాన్ని పక్కనపెడితే.. తాజాగా, ‘సైరా’ సెట్ కు సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రముఖ రచయిత సత్యానంద్ ఉన్నారు. ‘సైరా’లో తాము పోషించే పాత్రల గెటప్ లలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి ఉండటం గమనార్హం.

అయితే, సుమారు రెండుమూడు నెలల క్రితం దిగిన ఈ ఫొటో ఇప్పుడు బయటకు రావడానికి కారణం ప్రముఖ సినీ రచయిత సత్యానంద్. చిరంజీవి నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన సత్యానంద్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో అమితాబ్, ‘మెగా’ హీరోలతో పాటు సత్యానంద్ కూడా ఉన్నారు. ‘సైరా’ సెట్ లో దిగిన ఈ ఫొటోను ఫ్రేమ్ చేయించి మరీ, సత్యానంద్ కు చిరంజీవి పంపారట. ఇన్ని రోజుల తర్వాత ఆ ఫొటోను సత్యానంద్ పోస్ట్ చేయడంతో దాన్ని చూసిన ‘మెగా’ అభిమానులు సంబరపడిపోతూ, దీనిని వైరల్ చేస్తున్నారు.

Related posts

Leave a Comment