సుప్రభాత సేవలో మాయ! ఒకరి బదులు మరొకరు శ్రీవారి సేవలోకి..

శ్రీవారి సేవా టిక్కెట్ల లక్కీడిప్‌ కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న సామాన్య భక్తుల అనుమానాలు నిజమయ్యాయి. స్వామివారి సుప్రభాతం సేవకు ఒకరి స్థానంలో మరొకరు హాజరవుతూ శుక్రవారం వేకువజామున నలుగురు భక్తులు తితిదే విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ టిక్కెట్లను మహారాష్ట్రలోని షోలాపూర్‌లో అంతర్జాల కేంద్రం నడుపుతున్న ప్రభాకర్‌ తనకున్న నైపుణ్యంతో కొన్ని ఆధార్‌కార్డుల ఆధారంగా సుప్రభాతం సేవా టిక్కెట్లను బుక్‌ చేశాడు. రూ.120విలువగల ఒక్కోటిక్కెట్టును రూ.2,500 చొప్పున యాత్రికులకు విక్రయించాడు. టిక్కెట్టుపై ఉన్న పేరుకు అనుగుణంగా అప్పటికప్పుడు భక్తులకు నకిలీ గుర్తింపు కార్డులు తయారుచేయించి శ్రీవారి దర్శనానికి పంపాడు. ఈ అక్రమ వ్యవహారంపై తితిదే విజిలెన్స్‌కు ముందస్తుగా వచ్చినసమాచారంతో నిఘా పెట్టింది. సుప్రభాతం సేవకు వెళుతున్న సమయంలో నలుగురు భక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంది. అక్రమానికి పాల్పడిన ప్రభాకర్‌ను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించగా వారు విచారిస్తున్నారు. ఇప్పటివరకూ నిందితుడు ఏకంగా 1200 సేవా టిక్కెట్లను ఇలా అక్రమ మార్గంలో పొందినట్టు తెలిసింది.

Related posts

Leave a Comment