సాహసమే ఊపిరి థాయ్‌లాండ్‌లో జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు విముక్తి

ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన థాయ్‌లాండ్‌ ‘గుహ నిర్బంధం’ కథ సుఖాంతమైంది. కబళించడానికి సిద్ధంగా ఉన్న వరదనీటి నడుమ 18 రోజుల పాటు చీకటి గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు బాలలు, వారి కోచ్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే 8 మందిని రక్షించిన సహాయ బృందాలు.. మంగళవారం మిగతా నలుగురితోపాటు వారి కోచ్‌కు విముక్తి ప్రసాదించాయి. దీంతో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో రిస్కుతో చేపట్టిన ఈ సంక్లిష్ట ఆపరేషన్‌ ముగిసింది.
విదేశాల నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు, థాయ్‌ నౌకాదళానికి చెందిన సుశిక్షిత నౌకాదళ ‘సీల్స్‌’ బృందం మంగళవారం తుది ఆపరేషన్‌ నిర్వహించి, నలుగురు బాలలు, 25 ఏళ్ల కోచ్‌ను గుహ నుంచి వెలుపలికి తెచ్చాయి. నీటితో నిండిన ప్రమాదకరమైన సన్నటి సొరంగ మార్గాల గుండా పయనిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ‘‘ఇది అద్భుతమో.. సైన్సో.. మరేమిటో మాకు తెలియదు. 12 మంది ‘వైల్డ్‌ బోర్స్‌’ ఫుట్‌బాల్‌ సభ్యులు, కోచ్‌ను రక్షించాం’’ అని థాయ్‌ సీల్స్‌ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. గత రెండు రోజుల్లో మిగతా 8 మందిని కాపాడినప్పుడు చేసిన రీతిలోనే మరోసారి ‘హూయా’ నినాదంతో ఈ ఆపరేషన్‌ను సీల్స్‌ సభ్యులు లాంఛనంగా ముగించారు. ఆ వెంటనే స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాలంటీర్లు, విలేఖరులు హర్షధ్వానాలు చేశారు. చివరిగా వైద్యుడు సహా నలుగురు థాయ్‌ నౌకాదళ డైవర్లు గుహ నుంచి బయటకు రావడంతో ఆపరేషన్‌ పరిసమాప్తమైంది.
సరదాగా వెళ్లి..
11-16 ఏళ్ల నడుమ వయసును కలిగిన ఈ బాలలు, వారి ఈ కోచ్‌ గత నెల 23న ఫుట్‌బాల్‌ ప్రాక్టీసు తర్వాత ఉత్తర థాయ్‌లాండ్‌లోని మే సాయి జిల్లాలో పర్వతమయ తామ్‌ లువాంగ్‌ గుహలోకి వెళ్లారు. ఆ తర్వాత భారీ వర్షాలు కురియడంతో గుహ నుంచి బయటపడే మార్గాలన్నీ వరదనీటితో నిండిపోయాయి. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఆ బృందం బురదమయంగా ఉన్న ఒక గట్టుపైన ఆశ్రయం పొందింది. బ్రిటన్‌ గజ ఈతగాళ్ల బృందం రంగంలోకి దిగి గుర్తించేవరకూ.. 9 రోజుల పాటు వారంతా చిమ్మచీకట్లోనే గడిపారు.
అసాధ్య ఆపరేషన్‌
తొలుత బాలలను సురక్షితంగా ఎలా తీసుకురావాలో అర్థంకాక అధికారులు తలలుపట్టుకున్నారు. ఈ గుహ నాలుగు కిలోమీటర్లకుపైగా లోతుగా ఉండటం, దాన్ని చేరే మార్గాలన్నీ నీటితో నిండిపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఎగువన ఉన్న పర్వతానికి రంధ్రాలు పెట్టడం, వర్షాకాలం ముగిసేవరకూ కొన్నినెలల పాటు వేచిచూడటం వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించారు. ‘ఇది చాలా అసాధ్య ఆపరేషన్‌’ అని సహాయ బృందం నాయకుడు ఒక దశలో పెదవి విరవడం గమనార్హం.

చివరి అవకాశం వైపు..
అయితే గుహలో ఆక్సిజన్‌ స్థాయి ఆందోళనకర స్థాయికి పడిపోవడం; వర్షాలు ఉద్ధృతమై, వరదనీరు గుహను ముంచెత్తే ప్రమాదం పొంచి ఉండటంతో చిట్టచివరి అవకాశం వైపు అధికారులు మొగ్గారు. సుశిక్షిత గజఈతగాళ్లను సొరంగమార్గాల గుండా పంపి, బాలలను వెలుపలికి తీసుకురావాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలించడంతో సహాయ బృందాలు సద్వినియోగం చేసుకున్నాయి. గుహ నుంచి నీటి తోడేయడానికి భారీగా పంపులను ఏర్పాటు చేశారు. దీంతో సొరంగ మార్గాల్లోకి సుశిక్షిత డైవర్లు ప్రవేశించడానికి కొంతమేర అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే సహాయ సిబ్బంది గుహలోకి ప్రవేశించారు. బాలలకు మునుపెన్నడూ నీటిలో డైవింగ్‌ చేసిన అనుభవం లేకపోవడంతో వారికి మాస్కును వాడటం, ఆక్సిజన్‌ ట్యాంకు ద్వారా శ్వాస తీసుకోవడంపై శిక్షణ ఇచ్చారు. 50 మంది విదేశీయులు సహా 90 మంది డైవర్లు ఆ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు.

అడుగడుగునా ప్రమాదాలు..
అయితే ఆక్సిజన్‌ నిండుకోవడంతో గత శుక్రవారం ఒక థాయ్‌ మాజీ సీల్‌ గజఈతగాడు.. గుహలోనే మరణించాడు. దీంతో అడుగడుగునా ఆక్సిజన్‌ సిలిండర్లను పెట్టారు. కొన్నిచోట్ల పాకేందుకు మాత్రమే చోటు ఉంది. ఈ ఇబ్బందులు, అవరోధాల నడుమ ఫుట్‌బాల్‌ బృందాన్ని సహాయ బృందం రక్షించింది. ఆది, సోమవారాల్లో 8 మంది బాలలను వెలుపలికి తీసుకొచ్చింది. అదే జోరుతో మంగళవారం మిగతావారికి విముక్తి ప్రసాదించింది.
ఆందోళన తగ్గించే మందులిచ్చాం
గుహ నుంచి వెలుపలికి తరలించడానికి ముందు బాలలకు.. ఆందోళనను తగ్గించే ఔషధాన్ని ఇచ్చినట్లు థాయ్‌ ప్రధాని ప్రయుథ్‌ చాన్‌-ఓచా చెప్పారు. డైవర్లు పక్కనే ఉన్నప్పటికీ ఆ బాలలు.. నీటి అడుగున ఈత కొట్టడానికి భయపడతారేమోనన్న ఉద్దేశంతో అలా చేశామన్నారు. సందర్శకులకు సురక్షితంగా తీర్చిదిద్దేవరకూ తామ్‌ లువాంగ్‌ గుహను కొంతకాలం పాటు మూసివేస్తామని తెలిపారు.

ఆరోగ్యంపై దృష్టి
గుహలో కలుషిత నీటిని తాగడం, పక్షులు, లేదా గబ్బిలాల విసర్జితాలను తాకడం వంటివి వారు చేసి ఉంటారని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల వారికి ప్రమాదకరమైన అంటువ్యాధులు రావొచ్చని చెప్పారు. బతుకుతామో లేదో తెలియని పరిస్థితుల నడుమ ఇన్ని రోజుల పాటు ఉత్కంఠతో గడపడం వల్ల వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడి ఉండొచ్చన్నారు. శని, ఆదివారాల్లో విముక్తి పొందిన 8 మంది బాలల్లో ఇద్దరికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లు కనపడుతోందని చెప్పారు. మిగతావారంతా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నట్లు కనపడుతోందన్నారు. చిన్నారుల కోరిక మేరకు మంగవారం బ్రెడ్‌, చాక్లెట్లు ఇచ్చామన్నారు. మొట్టమొదటగా బయటకొచ్చిన నలుగురు బాలలు సాధారణ ఆహారం తీసుకోగలిగారని తెలిపారు. థాయ్‌ ప్రజలకు ఇష్టమైన మసాలా వంటకాలు తీసుకోవడానికి మాత్రం కొంతకాలం పడుతుందన్నారు. ‘‘వారంతా క్రీడాకారులు కావడంతో వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగానే ఉంది. వారి మానసిక స్థితిని అంచనావేయడానికి నిపుణుడిని రంగంలోకి దించాం’’ అని చెప్పారు. బాలలను కనీసం ఏడు రోజుల పాటు విడిగా ఉంచి, పరిశీలిస్తామని చెప్పారు. ఇది కొత్త అనుభవం కావడంతో ఆ బాలలకు ఎలాంటి అంటువ్యాధులు తలెత్తవచ్చన్నది వైద్యులకు బోధపడటంలేదు. వైద్య పరీక్షల్లో ఎలాంటి ప్రమాద సంకేతాలు లేకుంటే.. రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులను స్టెరిలైజ్డ్‌ దుస్తులతో కొద్ది దూరం నుంచి చూసేందుకు అనుమతిస్తామని చెప్పారు.

నేతల హర్షం
ఆపరేషన్‌ విజయవంతంగా ముగియడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరెసా మే హర్షం వ్యక్తంచేశారు. సహాయ సిబ్బంది ధైర్యసాహసాలను కొనియాడారు. బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ స్పందిస్తూ.. వైల్డ్‌ బోర్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు, వారిని రక్షించిన సహాయ సిబ్బందిని వచ్చే సీజన్లో ఓల్డ్‌ ట్రాఫర్డ్‌కు ఆహ్వానిస్తామని తెలిపింది. బాలలు క్షేమంగా బైటపడటాన్ని స్వాగతించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంస్థ ఫిఫా.. ఆదివారం మాస్కోలో జరిగే ఫుట్‌బాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వారు హాజరుకాబోరని తెలిపింది. వారు శారీరకంగా బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
వారు అద్భుతం: సహాయ సిబ్బంది
గుహలో చిక్కుకుపోయిన బాలల మనోధైర్యాన్ని.. సహాయ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న విదేశీయుడు ఇవాన్‌ కరాడ్జిక్‌ కొనియాడారు. ‘‘11 ఏళ్ల వయసులో వారు గుహ నుంచి డైవింగ్‌ చేసుకుంటూ రావడం ఆషామాషీ కాదు. చిమ్మచీకట్లో.. కేవలం టార్చిలైట్‌ వెలుగులో, ప్రమాదభరిత వాతావరణంలో ఈ సాహసం చేయడం అసాధారణం’’ అని పేర్కొన్నారు.

మస్క్‌ మినీ జలాంతర్గామి..
అంతకుముందు.. అమెరికాకు చెందిన అంతరిక్ష వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ తన నమూనా మినీ జలాంతర్గామితో థాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ‘‘మినీ జలాంతర్గామి సిద్ధంగా ఉంది. అది రాకెట్‌ భాగాలతో తయారైంది. గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్‌ జట్టు పేరిట దీనికి ‘వైల్డ్‌ బోర్‌’ అని నామకరణం చేశాం. భవిష్యత్‌లో అవసరమైతే ఉపయోగించుకోవడానికి వీలుగా దాన్ని ఇక్కడే ఉంచేస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు డైవర్లు ప్రయాణించవచ్చని చెప్పారు. ఇరుకైన మార్గాల గుండా పయనించేలా ఇది చాలా చిన్నగా, అనుకూలంగా ఉంటుందన్నారు.

Related posts

Leave a Comment