సహాడా తండాల నుంచి దొంగల ఖాళీ

నగర శివార్లలో చోరీలతో హల్‌చల్‌ చేసే చెడ్డీగ్యాంగ్‌ ఆట కట్టించేందుకు ప్రారంభించిన రాచకొండ పోలీసుల వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదు. కరడుగట్టిన నేరస్థుల ముఠాను పట్టుకునేందుకు పొరుగు రాష్ట్రంలో అలుపెరగకుండా శ్రమించినా ఆచూకీ చిక్కలేదు. దొంగల ముఠా మూలాలను గుర్తించి గుజరాత్‌ వెళ్లిన పోలీస్‌ బృందాలు దాదాపు 20 రోజులపాటు గాలించినా పట్టుకోలేకపోయారు. పోలీస్‌ బృందాల వేట సమాచారం అందుకున్న గజదొంగలు తండాలను ఖాళీ చేసి వెళ్లినట్లు తెలిసింది. ముఠా సభ్యుల్లో వణుకు పుట్టించడంతోపాటు వారిని ఎలాగైనా పట్టుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్న పోలీస్‌ బృందాలు మరోమారు అక్కడికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం వెళ్లిన పోలీస్‌ బృందాలకు దొంగలు దొరికినట్టే దొరికి పారిపోవడంతో నిరాశే మిగిలింది. మీర్‌పేట అగ్రికల్చర్‌ కాలనీలో గత జనవరిలో జరిగిన దోపిడీ కేసు దర్యాప్తు క్రమంలో చెడ్డీగ్యాంగ్‌ ప్రమేయాన్ని గుర్తించిన రాచకొండ పోలీసులు.. గుజరాత్‌లో వారి మూలాలున్నట్లు గుర్తించారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని పలు తండాల్లో ఈ ముఠాల ఆనవాళ్లను సేకరించారు. గత ఏడాది దసరా సెలవుల్లో మీర్‌పేటలోనే జరిగిన చోరీ దర్యాప్తు క్రమంలో అక్కడికెళ్లిన పోలీసులు ఇదే ముఠాకు చెందిన దినేశ్‌భాయ్‌ను పట్టుకొన్నారు. ఆ కేసులో సేకరించిన వేలిముద్రలు దినేశ్‌భాయ్‌తో సరిపోలడంతో అతడి సహచరుల్నీ పట్టుకునేందుకు ప్రయత్నించినా అప్పటికే దొంగలు పలాయనం చిత్తగించడంతో ప్రయోజనం లేకపోయింది.

నలుగురు ఇన్‌స్పెక్టర్ల బృందం ఆధ్వర్యంలో…
కొద్దిరోజుల క్రితం నలుగురు ఇన్‌స్పెక్టర్లతో కూడిన బృందాలు గుజరాత్‌ రాష్ట్రం దాహోడ్‌ పరిధి సహాడా ప్రాంతంలోని తండాలకు వెళ్లారు. ఇది తెలిసి దొంగలు నర్మదానదిని దాటి అటవీప్రాంతంలోకి పరారైనట్లు సమాచారం. కిషన్‌బాధ్య అనే ఓ దొంగ మాత్రం పోలీసులకు చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. తండాలోని ఓ గుడిసెలో నిద్రిస్తున్న కిషన్‌బాధ్య చిక్కినా.. చోరీ సొత్తు స్వాధీనం చేసుకోలేకపోవడంతో పోలీస్‌ బృందాల వేట పరిపూర్ణం కాలేకపోయినట్లు చెబుతున్నారు. అక్కడి పోలీసులు సహకారం అందించినా దొంగలు దొరక్కపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అయినా పట్టు వదలకుండా మరోమారు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related posts

Leave a Comment