సమ్మెకు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు దూరం సేవలు యథాతథం

వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు నేటి నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు దిగారు. దీంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పలు బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. అయితే ఈ సమ్మెకు కొన్ని ప్రయివేటు బ్యాంకులు దూరంగా ఉన్నాయి. యూనియన్‌లో ఈ బ్యాంకులు లేకపోవడంతో అవి సమ్మెలో పాల్గొనలేదు.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాంటి కొత్తతరం ప్రయివేటు బ్యాంకులు నేటి సమ్మెలో పాల్గొనట్లేదు. దీంతో ఆ బ్యాంకుల కార్యకలాపాలు బుధవారం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నేడు, రేపు తమ సేవలు అందుబాటులోనే ఉంటాయని ఆయా బ్యాంకులు చెబుతున్నాయి.

బ్యాంకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2శాతం వేతన పెంపు ప్రకటించి తమను అవమానిస్తున్నారని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగులు నేటి నుంచి సమ్మెకు దిగారు. వెంటనే వేతన సవరణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నేడు, రేపు సమ్మె చేపట్టారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. మొత్తం 48 గంటలు ఈ సమ్మె జరగనుంది. దీంతో ఆయా బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ లావాదేవీలు మినహా ఎలాంటి సేవలు లభించట్లేదు.

Related posts

Leave a Comment