శ్రీవారి భక్తుల ‘ముక్కోటి’ కష్టాలు

వైకుంఠ ఏకాదశికి పోటెత్తిన జనసంద్రం
సేవలందించడంలో చేతులెత్తేసిన తితిదే సిబ్బంది
ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో కదిలిన యంత్రాంగం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలలో శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడ్డారు. భక్తజనం రద్దీ ఊహించనంతగా పెరగడంతో తితిదే యంత్రాంగం కూడా చేతులెత్తేసింది. ఎన్నడూలేని విధంగా నాలుగు కిలోమీటర్ల పొడవునా రెండు వరుసలతో ఏర్పాటుచేసిన క్యూలైన్లు గురువారం అర్ధరాత్రికే భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం వేకువజామున ఐదింటికి మరింతమంది చేరడంతో తిరువేంకటపథం అవుటర్‌ రింగురోడ్డు మీదుగా రెండు కిలోమీటర్ల పొడవునా బారులు తీరారు. ముందుకు కదిలేవారు లేక, క్రమంగా వచ్చి చేరే వారు ఎక్కువవడంతో క్యూలైన్లకు వెలుపల రహదారి వెంట భక్తులు పడిగాపులుగాశారు. వరుసల్లో ముందుకు కదల్లేక అల్లాడిపోయారు. రోజంతా చలి వాతావరణమే ఉండటంతో గజగజ వణుకుతున్నారు.
అటు ఆకలిదప్పులు.. ఇటు తోపులాటలు
శ్రీవారికి శుక్రవారాభిషేకం అనంతరం వేకువజామున ఐదింటికి వీఐపీ దర్శనం ప్రారంభించారు. ఉదయం 8.05 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. అటు వైకుంఠం-1, 2 క్యూలైన్లలోని భక్తులతో పాటు ఇటు నారాయణగిరి ఉద్యానవనంలో వేచి ఉన్న వేలాది మంది ఒక్కసారిగా కదిలేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇదే క్రమంలో నాలుగు కిలోమీటర్ల క్యూలైన్లు, అవుటర్‌ రింగురోడ్డులో వేచి ఉన్న వేలాది మంది వరుసల్లోకి చేరేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడక్కడ తోపులాటలు జరిగాయి. ఉపవాసంతో ఉన్న యాత్రికులు పలువురు అస్వస్థతకు లోనయ్యారు. వారిని తితిదే సిబ్బంది, శ్రీవారి సేవకులు అంబులెన్స్‌ల్లో అశ్విని ఆస్పత్రికి తరలించారు. వరుసల్లో ఆఖరులో ఉన్న యాత్రికులకు అన్నపానీయాలు అందక అలమటించారు. ఇబ్బందిపడ్డ భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. తిరుమలలోని పరిస్థితులు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఫోన్లో మాట్లాడి ఇబ్బందులను పరిష్కరించాలని ఆదేశించారు. వెంటనే క్యూలైన్ల వద్దకు చేరుకున్న ఈవో సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో రవికృష్ణ, ఎస్పీ అభిషేక్‌ మహంతి పరిస్థితిని సమీక్షించారు. భక్తుల దప్పికను తీర్చడానికి 40 వేల నీటి సీసాలను అప్పటికప్పుడు తెప్పించి పంచిపెట్టారు. భారీగా అన్నప్రసాదాలను తయారుచేయించి అందించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధీకరించి శ్రీవారి ఆలయం వైపునకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.
శాస్త్రోక్తంగా పూజాదికాలు
గురువారం అర్ధరాత్రి అనంతరం శుక్రవారం ఏకాదశి ఘడియలు ప్రవేశించాక శ్రీవారికి ప్రాత:కాల ఆరాధన, వైకుంఠ ఏకాదశి ఆస్థానాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేక పూజలు చేశారు. తొలుత ప్రముఖులకు బ్రేక్‌ దర్శనం ప్రారంభించారు. ప్రముఖుల పేరిట మంజూరుచేసిన పాసులపై 3,562 మందికి హారతి లేని లఘుదర్శనం కల్పించారు. ఆ తర్వాత సామాన్య భక్తులకు మహా లఘుదర్శనం అమలుచేశారు. సాయంత్రం ఆరింటికి నాలుగు కిలోమీటర్ల క్యూలైన్లతో పాటు అవుటర్‌ రింగురోడ్డులో కిలోమీటరు పొడవునా యాత్రికులు బారులు తీరారు. ఆ సమయానికి కూడా భక్తులు వచ్చి వరుసల్లో చేరుతున్నారు. క్యూలైన్లలోనే దాదాపు లక్ష మందికిపైగా యాత్రికులున్నట్లు తితిదే వర్గాలు అంచనా వేశాయి. క్యూలైన్లలో ఉన్న వారికి మాత్రమే ద్వాదశి పర్వదినాన వైకుంఠద్వారాలు మూసే శనివారం అర్ధరాత్రిలోపు స్వామి దర్శనం చేయించగలమనే అభిప్రాయానికి వచ్చారు. ఇకపై వరుసల్లోకి భక్తులను అనుమతించరాదని నిర్ణయించి శనివారం వచ్చే యాత్రికులకు ఈ అవకాశం ఇవ్వలేమని స్పష్టంగా ప్రకటించారు. వీరిని ఆదివారం మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.

Related posts

Leave a Comment