శివసేనను దువ్వేందుకు రంగంలోకి దిగిన అమిత్ షా… రేపు ఉద్దవ్ తో భేటీ

  • శివసేనతో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు
  • 2014 లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీ, శివసేన
  • ఆ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు

శివసేనను ఎన్డీయేలోనే ఉంచేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగారు. రేపు సాయంత్రం ముంబైలో శివసేనాధిపతి ఉద్దవ్ ఠాక్రేను ఆయన నివాసం ‘మాతోశ్రీ’లో కలుసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే సంకీర్ణం ఇటీవలి కాలంలో కాస్త బలహీనపడడం, అదే సమయంలో ప్రతిపక్షాల్లో ఐక్యత వంటి పరిణామాల నేపథ్యంలో అమిత్ షా వ్యూహం మార్చినట్టున్నారు.

మిత్రులను చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీజేపీతో కంటే కాంగ్రెస్ తో జత కట్టడమే నయమన్న అభిప్రాయం ఇటీవలే శివసేన నుంచి వ్యక్తం కావడం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. 2019 ఎన్నికల్లో మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే అమిత్ షా ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

2014లో బీజేపీ, సేన కలసి పోటీ చేశాయి. బీజేపీ 23, శివసేన 18 లోక్ సభ స్థానాలను గెలుచుకున్నాయి. యూపీ తర్వాత 48 లోక్ సభ స్థానాలతో మహారాష్ట్ర దేశంలో రెండో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పొత్తు ఉన్న విషయం విదితమే. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రం కూడా కీలకమే. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీయే. అయితే 2014 ఎన్నికల అనంతరం బీజేపీ, శివసేన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉద్దవ్ ఠాక్రే తరచూ బీజేపీని, మోదీని విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్, అమిత్ షా భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

Related posts

Leave a Comment