వేడెక్కిన టీడీపీ రాజకీయం…అనుమానాస్పదంగా మంత్రి వ్యవహారశైలి

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర టీడీపీ రాజకీయం వేడెక్కింది. విశాఖలో ఏడు గంటలపాటు సిఎం పర్యటన కొనసాగనుంది. అయితే చంద్రబాబు టూర్‌కు కొద్దిగంటల ముందు మంత్రి గంటా వ్యవహారశైలి అనుమానాస్పదంగా మారింది. మంత్రి మౌనంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.

కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రి గంటా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తనపై పార్టీలో కుట్ర జరుగుతోందన్న అనుమానంతో ఉన్న ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. ఇవాళ సిఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో గంటా హాజరువుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. విశాఖపట్నంలోనే గంటా ఉండి కూడా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు చూడడం లేదు. ప్రొటోకాల్ వ్యవహారాలు కూడా పట్టించుకోవడం లేదు. మీడియా వెళ్లి సీఎం టూరు గురించి అడిగితే.. చంద్రబాబు వస్తున్నారా అంటూ ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మంత్రి గంటా తీరు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

పార్టీలో ప్రత్యర్ధులు తనపై కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేసినా హైకమాండ్ పట్టించుకోవడం లేదంటూ గంటా అలకబూనారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల మీడియాలో గంటాకు వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నాయి. బీమిలిలో టీడీపీ ఓడిపోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనక సొంత పార్టీ నేతలే ఉన్నారని భావిస్తున్నారు గంట. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఓటమి లేకుండా వరుస విజయాలతో వెళుతున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తెరవెనక కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధిష్టానం కూడా ఈ విషయంలో తనకు అండగా ఉండకపోవడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. అదే సమయంలో తనకు సంబంధం లేకపోయినా విశాఖ భూముల కుంభకోణంలో తనపై కేసులు వేయడం వెనక కూడా సొంత పార్టీ నేతలు ఉన్నట్టు గంటా చెబుతున్నారు. ఇలా పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రల తట్టుకోలేక దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

విశాఖలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఇవాళ ఉదయం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరకుంటారు. నేరుగా రుషికొండలోని సాయి ప్రియా రిసార్ట్స్ చేరుకుని వుడా అభివృద్ధి చేసిన అమృత వ్యాలీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు అక్కడే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే పట్టాల పంపిణీలో పాల్గొంటారు. అనంతరం సాయంత్ర ఐదున్నరకు ప్రత్యే క విమానంలో చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు టూర్ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related posts

Leave a Comment