విషవాయువు లీక్‌.. ఆరుగురు కార్మికుల మృతి

తాడిపత్రిలోని ‘గెర్డావ్‌’ కర్మాగారంలో దుర్ఘటన
మరో ఇద్దరికి స్వల్ప అస్వస్థత
రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంస్థ
మరో రూ.లక్ష ఇస్తామన్న ‘స్పర్శ’

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని గెర్డావ్‌ ఉక్కు కర్మాగారంలో విషవాయువు వెలువడి గురువారం ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఫర్నిష్‌ విభాగంలో 11 మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండగా కార్బన్‌ మోనాక్సైడ్‌ లీకై వారిని చుట్టుముట్టింది. అప్రమత్తమైన ముగ్గురు కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలిన వారిలో ఇద్దరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మిగిలిన ఆరుగురు కార్మికులు ఆ విషవాయువును పూర్తిగా పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తాడిపత్రికి చెందిన మనోజ్‌కుమార్‌(24), అమడగూరు మండలం మలకలవారిపల్లికి చెందిన గంగాధర్‌(37) ప్రాణాలు వదిలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాడిపత్రి మండలం బోడాయిపల్లికి చెందిన రంగనాథ్‌(21), కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన వసీమ్‌, కడప జిల్లా మంగపట్నానికి చెందిన శివ మద్దిలేటి(26), ప్రకాశం జిల్లా రాళ్లపల్లికి చెందిన గురువయ్య(40) మరణించారు. మృతుల బంధువులు, సహోద్యోగుల ఆర్తనాదాలతో ఆసుపత్రి ఆవరణ హోరెత్తింది.
ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారం
కార్బన్‌ మోనాక్సైడ్‌ ఎక్కువగా పీల్చడంతో అది హిమోగ్లోబిన్‌లో కలిసిపోవడంతో కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని వైద్యాధికారులు పేర్కొన్నారు. గెర్డావ్‌ ఉక్కు కంపెనీని మూడేళ్లుగా బ్రెజిల్‌కు చెందిన పారిశ్రామిక సంస్థ నిర్వహిస్తోంది. నిర్వహణ లోపంతోనే కార్మికుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయనీ, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని వామపక్షాలతో కలసి వైకాపా నాయకులు పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున గెర్డావ్‌ అధికారులు నష్టపరిహారం ప్రకటించారు. స్పర్శ స్వచ్ఛంద సంస్థ తరఫున ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు. మరోపక్క ప్రమాదానికి సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు పరిశ్రమలు, పోలీసు శాఖల అధికారులు రంగంలోకి దిగారు.

బాధితులకు సహకారం అందించండి: చంద్రబాబు
తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని రకాల సహా య సహకారాలు అందించాలని సూచించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
జగన్‌ దిగ్భ్రాంతి: తాడిపత్రిలో కార్మికుల మృ తిపై వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన…క్షతగాత్రులకు వెంటనే వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పరిహారం ఇవ్వాలి.. వపన్‌కల్యాణ్‌: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో విషవాయువులు వెలువడి ఆరుగురు కార్మికులు మరణించిన ఉదంతంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని, తగిన పరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Related posts

Leave a Comment