విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్

క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికిఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు

  ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపువేసిన చిత్రానికిముళ్ళపూడి వాఖ్యానం ఇది. ఇంతకంటే ఆయన నటనా వైదుష్యం గురించి చెప్పడానికి ఇంకేముంటుంది.. మాటల్లో.. ఎంతని చెప్పగలం.. ?  నటయశస్వి, నటనా సామ్రాట్, విశ్వనట చక్రవర్తి.. ఇవి నటనా ప్రపంచంలో ఆయనకు వచ్చిన బిరుదులు.. తల్లిదండ్రులు పెట్టిన పేరు సామర్ల వెంకట రంగారావు నాయుడు.జూలై 3 తేదీ 1918 సంవత్సరం కృష్ణాజిల్లా నూజివీడు గ్రామంలో జన్మించారునట యశస్వి గా పేరు పొందిన ఎస్వీఆర్ మూడు దశాబ్దాలపాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమయ్యారంటే వేరెవరూ పాత్రలలో ఇప్పటివరకూ ఇమడలేకపొయ్యారని చెప్పొచ్చు.         కృష్ణాజిల్లా నూజివీడులో 1918 జులై 3 తేదీన శ్రీ కోటేశ్వరనాయుడు శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మలకు జన్మించారు యస్వీ రంగారావు. బిఎస్సీ పట్టాపొందాక నటన మీద అభిమానంతో రంగస్థలంలోకి ప్రవేశించారు. షేక్స్పియర్నాటకాలు అనేకం వేశారు. మంచినటులుగా గుర్తింపు పొందిన తర్వాత సినిమాల్లో అవకాశం కోసం 1946 సంవత్సరం మద్రాసు చేరారు. 1946లో వరూధిని చిత్రంతో చలనచిత్ర జీవితం ప్రారంభమయింది. కానీ విధి వక్రించి సినిమా పరాజయం పొందటంతో, ఆయనకు ఎంతో మనస్థాపం కలిగింది. దాదాపు రెండు సంవత్సరాలు సినీ జీవితం వైపు చూడనేలేదు. 1948 సంవత్సరంలో మళ్లీ సినిమాల కోసం మద్రాసుకి వచ్చారు.మద్రాసులో ఎక్కని, దిగని గడపలేదు.. వెళ్లని స్టూడియోనే లేదు. అయినా నిరుత్సాహపడలేదు. అవకాశం వస్తే తన నటనను నిరూపించుకోవటం కోసం 1950 సంవత్సరం వరకు వేచి చూడాల్సొచ్చింది. 1950 సంవత్సరం పల్లెటూరి పిల్లలో చిన్నవేషం దొరికింది. దొరికిన పాత్రద్వారా తన నటనను ప్రదర్శించి నటుడుగా సినీ రంగంలో నిలదొక్కుకొని మహోన్నత స్థానం పొందిన కృషీవలుడు యస్వీ రంగారావు.వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాతే దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.యస్వీఆర్ రకంగా చూస్తే వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు.పాకిస్తాన్తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, డబ్బును దేశ రక్షణ నిధికి ఇచ్చారాయన. తెలుగు వారు గర్వింప తగ్గ మహానటుడు ఎస్వీ రంగారావు. హీరోగా ఆయన పాత్రలు ధరించకపోయినా, ఆనాటి మేటి హీరోలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లకు ధీటుగా నిలబడ్డ విలక్షణ నటుడు ఎస్వీఅర్. సాంఘిక పాత్రలతో పాటు పౌరాణిక పాత్రలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి.

ఎస్వీఅర్ ... సంభాషణలలో స్పష్టత, హావభావాలు పలికించడంలో నిపుణత ఆయన సొంతం. స్వతహాగా ఎస్వీఅర్ సాహితీ అభిమాని. షూటింగ్ విరామ సమయంలో ఆయన ఎక్కువగా పుస్తకాలు చదివేవారు. వివేకానందుడి గ్రంధాలు అంటే విపరీతమైన అభిమానం.ఆరోజుల్లో ముక్కామల, కొంగర జగ్గయ్య, జయలలిత, ఎస్వీ రంగారావు ఇళ్ళల్లో పెద్ద పెద్ద వ్యక్తిగత లైబ్రరీలు ఉండేవి. మార్కెట్ లోకి ఏదైనా మంచి పుస్తకం వస్తే వెంటనే పుస్తకాన్ని కొని రంగారావు తన లైబ్రరీ లో దాచుకొనేవారు.సినిమాలలో రకరకాల పాత్రలను పోషించిన ఎస్వీఅర్ కు వివేకానందుడి జీవితాన్ని సినిమా గా తియ్యాలన్న బలీయమైన కోరిక ఉండేది. కానీ.. అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. దీని గురించి ఒక ప్రముఖ రచయిత చేత స్క్రిప్ట్ కూడా తయారు చేయి౦చారుకూడా.. 

  యస్వీ రంగారావులో కళాకారునికి ఉండవలసిన అన్ని లక్షణాలు వున్నాయి. నిండైన విగ్రహం, మంచివాచికం, పాత్రకు తగిన అభినయం ఇవన్నీ ఆయనకు మంచి నటుడిగా నిలబడడానికి కలిసొచ్చిన అంశాలు. తరం ప్రేక్షకుల నుండి ఈతరం ప్రేక్షకులవరకూ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన విలక్షణ నటుడు యస్వీ రంగారావు.కంచులా ఖంగుమని మోదే కంఠం, కన్నులతోనే అలవోకగా ఆయన పలికించే భావాలు నటనకు కొత్త భాష్యాన్ని చెప్పాయి. నటనలో వైవిధ్యం, డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శైలి.. తనకంటూ సొంతబాణీని ఏర్పాటు చేసుకోవడానికి ఉపకరించాయి. భారీ డైలాగుల్నికూడా గుక్కతిప్పుకోకుండా చెప్పేయగలగిన ప్రజ్ఞాశీలి.. ఎస్వీఆర్. 1951 సంవత్సరంలో విజయావారు నిర్మించిన పాతాళభైరవి చిత్రంలో మళయాళ మాంత్రికుడిగా ఆయన నటన నభూతో నభవిష్యతి.. ‘జై పాతాళభైరవి.. సాహసం శాయరా ఢింబకా.. దేవి కరుణించేనుఅంటూ ఆయన చెప్పిన డైలాగుల్ని ఇప్పటికీ జనం మర్చిపోలేదు.చిత్రసీమలో నాయకపాత్ర ఎంత ప్రధానమైందో, ప్రతినాయక పాత్రకూడా అంతే ప్రధానమైంది. దుష్టపాత్రల్లో ఆయన చూపిన అభినయం ఎప్పుడూ గుర్తుండిపోతుంది. శిష్ట పాత్రల్లో ఒలికించిన లాలిత్యం మదిలో అలాగే నిలబడిపోతుంది. రెండు విధాలుగానూ ఆయన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు

యస్వీ రంగారావు ధరించే పాత్ర ప్రతినాయక పాత్ర అయినా అది నాయక పాత్రతో పోటీపడేది. అందుకే ఆయన ధరించిన ప్రతినాయక పాత్రలు, రావణాసురుడు, కంసుడు, కీచకుడు వంటి పాత్రలు, హీరో పాత్రలతో సమానం. పాత్రల్ని ప్రేక్షకులు ఆదరించారు. మాయాబజార్చిత్రంలో ఘటోత్కచుడి పాత్ర, భక్తప్రహ్లాదలోని హిరణ్యకశిపుడి పాత్ర ఎస్వీఆర్ అభిమానులు కలకాలం గుర్తుంచుకునే పాత్రలు.       ఒకప్పుడు దుష్టపాత్రలంటే గళ్ళలుంగీ, బోడ్లో కత్తి, మొహంమీద కత్తిగాట్లతో వికారమైన నవ్వుతో ప్రేక్షకులను భయపెట్టేవారు. కాని యస్వీ రంగారావు చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత దుష్టపాత్రల స్వరూపం మారిపోయింది. కారణం ఆయన నటనలో మొరటుతనం లేకపోవటమే. డైలాగ్ని ఎక్కడ విరవాలో అక్కడ విరచి పలకడం ఆయన చూపించిన ప్రత్యేకతయస్వీ రంగారావుకు క్రమశిక్షణ అంటే ప్రాణం. తోటి నటీనటులను ఎంతగానో గౌరవించేవారు. అందరితోనూ తరతమ భేదం లేకుండా కలిసిపోయే వ్యక్తిత్వం ఆయనది. పౌరాణికమే కాక హాస్యరస ప్రధాన చిత్రాలలోను నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. బ్రతుకుతెరువు, అప్పుచేసి పప్పుకూడు, మిస్సమ్మ, తోడికోడళ్లు వంటి హాస్య చిత్రాలు కోవకే చెందుతాయి.

 ఎస్వీరంగారావు రెండు విభిన్న పాత్రలను ఒకేసారి చేసి శభాష్అనిపించిన చిత్రంబంగారు పాప’. ఇవికాక తాతమనమడు, షావుకారు, పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు, గుండమ్మకథ వంటి ఫ్యామిలీ సెంటిమెంట్చిత్రాల్లో కూడా నటించారు.ఎస్వీ రంగారావు కిలాడీ సింగన్న, దెబ్బకు ఠా దొంగలముఠా, బందిపోటు భీమన్న, బస్తీ కిలాడీలు లాంటి కొన్ని యాక్షన్చిత్రాల్లో కూడా నటించారు. తన నటనతో అప్పటి యువతను ఎంతో ఉర్రూతలూగించారు. ఆనాడే హాలీవుడ్నటులను తలపించే రీతిలో నటనా వైభవాన్ని ప్రదర్శించారు.

నర్తనశాల చిత్రంలో కీచకుడిపాత్రలో జీవించిన ఎస్వీఆర్ ని పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వచ్చాయి. సినిమాకు జకార్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమనటుడి పురస్కారం వరించింది. శాన్సెబాస్టియన్ఫిలిం ఫెస్టివల్లోనమ్మినబంటుచిత్రంలోని ఆయన సాత్విక పాత్రకు లభించిన పురస్కారం ఎంతో విలువైనదిఎస్వీఆర్బహుభాషాకోవిదుడు. ఆయనకు ఇంగ్లీషు, తమిళం, తెలుగు భాషలు బాగా వచ్చు. సంస్కృత భాషతో మంచి పరిచయం ఉంది. దైవకార్యాలన్నా, భూరి విరాళాలు ఇవ్వాలన్నా ఆయన వెనుకాడేవారు కాదు. మహా భక్తుడు. తమిళం మాతృభాష కాకపోయినా ఎన్నో చిత్రాల్లో నటించి విజయాలు సాధించారు.విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నటసింహ లాంటి ఎన్నో బిరుదుల్ని ఆయన పొందారు. చదరంగం (1967) ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలిచింది. బాంధవ్యాలు (1968) తొలి తెలుగు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకొంది.

 “బాబూ వినరా.. అన్నా తమ్ములా కథ ఒకటిఅంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న అనుబంధం ముక్కలైతే కంటనీరు ఒలికించే ఇంటిపెద్దగా, “వివాహ భోజనంబు, వింతైన వంటకంబుఅంటూ ఘటోత్కచుడిగా, “డోంగ్రే, గూట్లే.. మాట తప్పావ్, పచ్చి నెత్తురు తాగుతాఅంటూ కర్కశమైన రౌడీగానరకాసురుడు, కంసుడు, రావణుడు, కీచకుడు, హిరణ్యకశిపుడుఇలా అనేక రకాలు పాత్రలతో నటమాంత్రికుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎస్వీఆర్ నటనావైద్యుష్యానికి సాటి మరొకటి లేనేలేదు.  భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం.. నవరసాలన్నీ ఆయన పోషించిన పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయాయి. పాత్రవేసినా పూర్తిగా అందులోకి చొరబడి అచ్చంగా ఇలాగే ఉంటారేమో అన్నంతగా ప్రేక్షకుల్ని ఆయన మంత్ర ముగ్ధుల్ని చేసేవారు. బొబ్బిలి తాండ్రపాపయ్య అచ్చంగా ఇలాగే ఉంటాడేమో అనుకున్న జనం బొబ్బిలి యుద్ధం సినిమాలో ఆయన నటనకు నీరాజనాలు పట్టారుపాత్ర ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోయి దానికి పరిపూర్ణత్వాన్ని కలిగించిన మహా నటుడు ఎస్వీరంగారావు. నవరస నటనా సార్వభౌముడిని ఆయన వర్ధంతి సందర్భంగా తలచుకోవడం తెలుగువాళ్లగా మనం చేసుకున్న అదృష్టం..

మంచినటుడిగా గుర్తింపు పొంది పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొంటున్న సమయంలో ఎస్వీ రంగారావు గుండెపోటుతో మరణించటం తెలుగు, తమిళ చలనచిత్ర రంగాలకు తీరని లోటు. జులై 18, 1974 సంవత్సరం ఎస్వీఆర్ దివిజ నట సామ్రాజ్యంలో లీనమైపోయారు.
ఆయన పుట్టిన నెల, పోయిన నెలా ఒకటే కావడం విశేషం.. తెలుగు సినీ ప్రపంచం ఇదే సంవత్సరం ఇద్దరు ముద్దుబిడ్డల్ని పోగొట్టుకుంది. ఇద్దరిలో ఒకరు నవరస నటనా చక్రవర్తి ఎస్వీరంగారావు అయితే, మరొకరు గానగంధర్వుడు ఘంటసాల వేంకటేశ్వరరావు.

Related posts

Leave a Comment