వివాదాల్లో త్రిష.. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్టా.. మంచి టీజింగ్‌ సాంగ్‌ గుర్తుందా? ఆ పాట గురించి ఇప్పుడెందుకు అంటారా? సంచలన నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వినోదానికి పోయిందో, లేక ప్రచారాన్ని కోరుకుందో గానీ, అది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ అమ్మడు తరచూ విదేశాలు చుట్టొస్తున్న విషయం తెలిసిందే. అలా ఇటీవల దుబాయ్‌కు రౌండ్‌ వేసింది. అక్కడ ఒక అందమైన ఈత కొలను (స్మిమ్మింగ్‌ పూల్‌)లో చక్కగా ఈదేసింది. పనిలో పనిగా అదే కొలనులో చక్కగా విన్యాసాలు చేస్తున్న డాల్ఫిన్లను చూడగానే అమ్మడు తెగ ముచ్చట పడిపోయింది. అంతటిలో ఆగితే ఆమె త్రిష ఎందుకవతుంది. అందులో ఒక డాల్ఫిన్‌ తెగ ముద్దొచ్చేస్తుంటే, ఆగలేక దాన్ని సమీపించి పట్టుకుని ముద్దెట్టేసింది. అంతే ఆ డాల్ఫిన్‌కు కూడా త్రిషను చూడగానే ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. అదీ ఈ సుందరి బుగ్గపై చుంబనాలు పెట్టేసింది. లేదా త్రిషనే దానితో ముద్దు పెట్టించుకుని ఉండవచ్చు.

ఏదైతేనేమీ త్రిష, డాల్ఫిన్‌ల ముద్దు ముచ్చట్ల ప్రహసనం ఒక రేంజ్‌లో జరిగిపోయింది. అక్కడితో ఆగలేదు. ఇంత చేసి డాల్ఫిన్‌తో తన ముద్దు ముచ్చట్లను ప్రపంచానికి తెలిపి ప్రచారం పొందాలి కదా! అవును ఆ దృశ్యాలను ఈ చెన్నై చిన్నది తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అంతే అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇక్కడి వరకూ త్రిష బాగానే ఎంజాయ్‌ చేసింది. ఆమె అభిమానులు సూపర్‌ అంటూ తెగ లైక్‌ చేసేస్తున్నారు. ఇంకేంటి అంతా బాగానే ఉందిగా, త్రిషకు మంచి ఫ్రీ ప్రచారం లభించిందిగా అనేగా మీ ప్రశ్న. రండి చూద్దాం. త్రిష పెటా అనే జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే వివాదాల్లో పడేసింది. అలాంటి పెటా సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండి డాల్ఫిన్‌ లాంటి జల జీవాలను హింసిస్తుందా అంటూ జీవ ప్రాణుల సంరక్షణ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు.

స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు త్రిషకు ఎవరిచ్చారు? అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా నిర్వాహకురాలు పరిదా తంబల్‌ నటి త్రిష చర్యలను తీవ్రంగా విమర్శించారు. సముద్రంలో జీవించే ప్రాణులైన డాల్ఫిన్లు కాలక్షేప ఈత కొలనుల్లో ఎలా సహజమైన పరిస్థితి అమరుతుంది? అని ప్రశ్నించారు. అసలు డాల్ఫిన్లకు మనుషుల అలవాట్లను ఎందుకు నేర్పించాలి? వాటిని వాటి మానాన జీవించనీయండి అని ఆవేశంగా అన్నారు. దీంతో ఒక పక్క అభిమానులు డాల్ఫిన్లలో తన ముద్దు దృశ్యాలను చూసి చాలా క్యూట్‌గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే మరో పక్క విమర్శకులేంటి తనపై దాడి చేస్తున్నారు? అని త్రిష తల పట్టుకుందట. ఈ అమ్మడిప్పుడు రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది.

Related posts

Leave a Comment