విభజన హామీలు అమలుచేయాలి

విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా.. కనీసం 20వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కోరింది. వరి, మక్కలకు కనీసం మద్దతు ధర రెండువేల రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తిచేసింది. రైతులకు మేలు చేకూర్చేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరింది. సోమవారం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వాటి వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. వాటిని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి పంపిస్తామని తెలిపారు.
ఆమోదించిన తీర్మానాలు ఇవీ..
1.విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, విభజన ప్రక్రియను సంపూర్ణం చేయాలి.
2.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించకపోయినా రూ.20 వేల ప్యాకేజీ ఇవ్వాలి.
3.వరి ధాన్యం, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర పెంచాలి. ఆర్థిక విశ్లేషకులు మద్దతు ధర ప్రకటించినపుడు ద్రవ్యోల్బణం పెరుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఇది తప్పు. వాస్తవాలను విశ్లేషించి కనీసంగా వరికి రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు మద్దతు ధర ప్రకటించాలి.
4.రైతులకు కొంత ఊరట కలిగించేలా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి.
5.తెలంగాణలో ఉండే ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతూ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి. తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపించాం. కేంద్రం కాలయాపన చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణను కూడా తన దగ్గరే పెట్టుకొంది. ఇవి న్యాయమైన డిమాండ్లు. తెలంగాణలో ఎస్టీలు, ముస్లింలది ప్రత్యేక పరిస్థితి. ఉమ్మడి రాష్ట్ర లెక్కలనే ఇప్పటికీ తీసుకుంటున్నారు. అదే తమిళనాడులో మాత్రం 69% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చారు. రాష్ర్టానికో నీతి వద్దు. ద్వంద్వ చట్టాలు, ద్వంద్వ నీతి దేశ సమగ్రత దృష్ట్యా కూడా మంచిది కాదు. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. తమిళనాడు తరహాలోనే తొమ్మిదో షెడ్యూలులో వెంటనే చేర్చి, మా చట్టాన్ని గౌరవించి, రాష్ట్రపతి ఆమోదం ఇప్పించాలి.
6.బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశాను. అన్ని రాష్ర్టాల్లో 50 శాతానికి పైబడి ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖలు ఉన్నయి. బీసీల వాయిస్‌గా ఉండే ఆర్ కృష్ణయ్యను వెంట తీసుకెళ్లి ప్రధానమంత్రికి చెప్పాం. బీసీలకు కేంద్రక్యాబినెట్‌లో ఒకశాఖను ఇస్తే పోయేదేం లేదు. మీరు ఒక్క రూపాయిస్తే.. రాష్ట్రం నాలుగు రూపాయలు పెట్టుకుంటది. బీసీల సంక్షేమం జరుగుతదని చెప్పినా చెవులకు ఎక్కడం లేదు. ఇప్పటికైనా కేంద్రం కండ్లు తెరువాలి.
7.బీసీలు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ శాసనసభ ఓ పదిసార్లు తీర్మానం చేసింది. మేం పార్టీగా మళ్లీ ఆ విషయంపై కేంద్రాన్ని డిమాండు చేస్తున్నం. దేశంలో ఎంపీల సంఖ్యను కూడా పెంచుకోవాల్సి ఉంది. ఎప్పుడో 33 కోట్ల జనాభా ఉన్నపుడు ఏర్పాటుచేసుకున్న నియోజకవర్గాలు ఇవి. ఒక్కో ఎంపీ పరిధి ఇప్పుడు 25-30 లక్షలకు పోతున్నది. అందుకే 1/3 సీట్లు పెంచైనాగానీ చట్టసభల్లో బీసీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి.
8.ఫెడరల్ స్ఫూర్తి పెంపొందించాలి. నీతి ఆయోగ్ అంటే వాస్తవానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. ప్లానింగ్ కమిషన్ స్థానంలో మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్‌ను రూపొందించింది. కానీ ఇప్పటివరకు ఏం ట్రాన్స్‌ఫార్మేషన్ రాలే. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది. దాని కింద పెట్టిన స్లోగన్ కూడా.. కో-ఆపరేటివ్ ఫెడరలిజం. ఎక్కడుంది? మొన్న ఢిల్లీ వెళ్లి నీతి ఆయోగ్ మీటింగ్‌లో కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన. 70 సంవత్సరాలు గడిచింది. ఒక్క దాని మీద కూడా సమీక్షించలేదు. అక్కడ సంయుక్త జాబితాలో ఉన్న అధికారాలుగానీ ఏవీ సమీక్షించలేదు. 70 ఏండ్ల ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరుగాలి. కానీ కేంద్రీకరిస్తూ పోతున్నారు. రాష్ర్టాలను మున్సిపాలిటీలుగా మార్చినరు. నా వాదనకు చాలామంది సీఎంలు మద్దతు తెలిపినరు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి వంటివాటిపై నిర్ణయాధికారం రాష్ర్టాలకు ఉండాలి అని సీఎం అన్నారు. ఇవన్నీ ఉత్తగ చెప్తలేదని, నాలుగున్నరేండ్ల అనుభవం తర్వాత చెప్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెసోళ్ల లెక్కనే పాత కథనే చెప్పినరు. కాంగ్రెసోళ్లు మొగల్ సామ్రాజ్యం నడిపినట్టే ఇప్పుడు నడుపుతున్నారు. నిజమైన భారత పరివర్తన (ట్రాన్స్‌ఫార్మేషన్) ఇంకా జరుగటం లేదు. మాట చెప్పినంత స్వీట్‌గా పని లేదు. పని పెంచాల్సిన అవసరముంది. కేంద్రం పెంచుతదని ఆశిస్తున్నం అన్నారు.

Related posts

Leave a Comment