విజయసాయిరెడ్డి X రమేష్‌

  • విజయ్‌మాల్యా నుంచి చంద్రబాబుకు పార్టీ విరాళం రూ.150 కోట్లు
  • వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణ

‘‘విజయ్‌మాల్యా మార్చి 1-2016 వరకు రాజ్యసభలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత రోజున దేశం వదిలి వెళ్లిపోయారు. సరిగ్గా పది రోజుల తర్వాత మీరు మార్చి 12, 13, 14 తేదీల్లో లండన్‌ వెళ్లి విజయ్‌మాల్యాను కలిశారా లేదా? 2009లో, 2014 ఎన్నికల్లో రాజకీయ విరాళాల రూపంలో మొత్తం రూ.150 కోట్లను…. ఆయన నుంచి మీరు సేకరించారా లేదా? దీనికి చంద్రబాబునాయుడు జవాబు చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు మీరు జవాబు చెప్పనట్లయితే ఇవన్నీ వాస్తవాలేనని ధ్రువీకరించాల్సి వస్తుంది. ప్రత్యేకహోదా కోసం లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాసం పెట్టి ఆ అంశం రాజ్యసభలోనూ చర్చకు రావాలని మేం కాలింగ్‌ అటెన్షన్‌ ఇస్తే…తెదేపా సభ్యులు సభను ఆటంకపరిచారు. యూ టర్న్‌ అంకుల్‌గా పిలవబడే చంద్రబాబు దిల్లీకి దేనికి వస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ ఇలా అన్ని రాజకీయపక్షాలతో మితృత్వం కలిగి… ఆ తర్వాత అన్ని పార్టీలకూ విడాకులు ఇచ్చిన వ్యక్తి… ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకొచ్చారు… కాబట్టి మళ్లీ కొత్త భాగస్వామి కోసం వెతుక్కుంటూ దిల్లీకి వస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌లకు చెందిన ఆంధ్ర రాష్ట్రంలోని నాయకత్వం ప్రజలకు జవాబు చెప్పాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాలుగేళ్ల దుర్మార్గపాలన, ఓటుకు నోటు కేసు, విజయవాడలో సెక్స్‌ రాకెట్టు, రాజధానిలో భూముల కుంభకోణం, పోలవరంలో అవినీతి… ఇవన్నీ మరచిపోతున్నా… ఇటువంటి ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నారా? ఆయా పార్టీల జాతీయ నాయకత్వానికి తెలియదేమో! ఈ విషయాలను వారికి తెలియజేయాల్సిన బాధ్యత వాటి రాష్ట్ర నాయకత్వాలపై ఉంది…’’ అని ఆయన పేర్కొన్నారు.

ఎ-2గా ఉన్న మీకు చంద్రబాబుపై మాట్లాడే అర్హత ఎక్కడిది?
తెదేపా ఎంపీ రమేష్‌ ధ్వజం
‘‘కేవలం ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు మాట్లాడితే మీడియాలో హైలెట్‌ అవ్వచ్చని విశ్వసనీయత లేని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతీరోజూ మాట్లాడుతున్నారు. రాజ్యసభలో తెదేపా, కాంగ్రెస్‌ తరఫున రామచంద్రరావు, అన్నాడీఎంకే సభ్యులు రాష్ట్రాల సమస్యలపై ఆందోళన చేస్తుంటే అక్కడ ఏమీ చేయకుండా విజయ్‌చౌక్‌కు వచ్చి మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో మీకున్న అర్హత… స్థానమేంటి? ఎ-2గా ఉండటమే అర్హతగా ఏ-1 జగన్‌ మిమ్మల్ని ఇక్కడకు (పార్లమెంట్‌కు) కేసులను జాగ్రత్తగా చూసుకునేందుకు పంపలేదా? చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? విజయ్‌మాల్యాను లండన్‌లో కలిసి డబ్బు తీసుకున్నారని అంటున్నారు. ఇందులో కనీసం 0.1శాతమైనా నిజం ఉందా? ఒక్క చిన్న ఆధారమైనా చూపించగలరా? చూపించలేకపోతే దేనికైనా సవాల్‌.

ప్రతీరోజూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న వైకాపా నేతలు ప్రధానిని ఒక్క మాట అనగలరా? అవసరమైతే రేపు ప్రధాని ఇంటి వద్దకు వెళ్లి ధర్నా చేసే సత్తా మాకుంది. మీకు ఆ ఆలోచనన్నా ఉందా? చంద్రబాబు దిల్లీ పర్యటనను పక్కదోవ పట్టించేందుకే వైకాపా ఎంపీల ఆమరణ దీక్ష అనేది తీసుకువచ్చారు. అందరూ మూకుమ్మడి(మాస్‌)గా రాజీనామాలు చేసినపుడు తీసుకోరు… ఆమోదించరు? వచ్చే సంవత్సర కాలంలో వీరి రాజీనామాలు ఆమోదించకుండా… ఉపఎన్నికలు రాకుండా మాట్లాడుకుని భాజపా, వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. విభజన సమయంలో బెయిల్‌ కోసం కాంగ్రెస్‌తో… ఇప్పుడు కేసుల నుంచి బయటపడేందుకు భాజపాతో వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని…’’ ఆయన వివరించారు.

Related posts

Leave a Comment