విజయసాయిరెడ్డిని పంపి జగన్ 30 కోట్లు అడిగారు: జేసీ దివాకర్ రెడ్డి

జగన్ డబ్బు మనిషి.. డబ్బు కోసం తపిస్తూ ఉంటారు
మంచి పని చేస్తున్న చంద్రబాబును పది కాలాల పాటు గుర్తు పెట్టుకుంటారు
రెండు రాష్ట్రాల్లో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాదే
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ డబ్బు మనిషని… కడప యాసలో ఎప్పుడూ ‘లెక్క.. లెక్క’ అంటూ తపించిపోతుంటాడని అన్నారు. ఒకరోజు తన వద్దకు ఎంపీ విజయసాయిరెడ్డిని పంపి రూ. 30 కోట్లు అడిగారని… అయితే, ‘మీ తాత, మీ నాన్న కంటే నేనే పెద్ద రెడ్డిని’ అని చెప్పానని అన్నారు. తనకు ఎవరినీ పొగిడే అవసరం లేదని… పొగిడి పదవులు పొందాలనే స్వభావం తనది కాదని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పని చేశానని… తనకన్నా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినవారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పారు.

గాంధీని మనం చూడకపోయినా, ఆయన అంటే ఎవరో అందరికీ తెలుసని… అలాగే ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పదికాలాల పాటు గుర్తు పెట్టుకుంటారని జేసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబును విమర్శించానని… అయితే కాంగ్రెస్ భూస్థాపితం అయిన తర్వాత జగన్ కంటే చంద్రబాబే మేలనిపించి టీడీపీలో చేరానని తెలిపారు. రాయలసీమకు నీరందిస్తే చీనీ, అరటి, దానిమ్మ వంటి పండ్ల తోటల ద్వారా రైతులు లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందుతారని… అందుకే ఎక్కడో ఉన్న నీటిని రాయలసీమకు చంద్రబాబు మళ్లించారని చెప్పారు.

Related posts

Leave a Comment