వారివన్నీ కుర్చీల కొట్లాటలే

-తెలంగాణకు అన్యాయం జరిగినా గతంలో పెదవి విప్పని కాంగ్రెస్ నేతలు
-ప్రజల ప్రగతి కోసం తపిస్తున్న టీఆర్‌ఎస్
-కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకే
-తిరుమలగిరి జనహితసభలో మంత్రి హరీశ్‌రావు
-ప్రజల ముందుకు వచ్చే దమ్ము కాంగ్రెస్‌వారికి లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కాంగ్రెస్ నాయకులు గెలిచినా.. ఓడినా కుర్చీల కుట్రలు, కుతంత్రాలు, కొట్లాటలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే సీఎం కుర్చీకోసం.. ఓటమి పాలైతే పీసీసీ కుర్చీకోసం వెన్నుపోట్లు, అధిష్ఠానం వద్ద పైరవీలు వారికి పరిపాటేనన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగినా కిమ్మనకుండా కూర్చున్న ఘనులు వారని ఎద్దేవా చేశారు. అందుకే తెలంగాణను సాధించుకున్న అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. తాగునీరు, సాగునీరు అందించి ప్రజల బతుకులు మార్చడానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. మంత్రి మంగళవారం విద్యుత్, ఎస్సీకులాల అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డితో కలిసి సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలో ఎస్సారెస్పీ కాల్వలను పరిశీలించారు. గోదాముల ప్రారంభోత్సవాలతోపాటు సాయంత్రం తిరుమలగిరి మండల కేంద్రంలో జరిగిన తుంగతుర్తి జనహితసభలో పాల్గొన్నారు.

తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన జనహిత సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. టీఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి రైతులు పచ్చగా ఉండాలని కోరుకుంటారు.. అందుకే ప్రతి రైతుకు ఎకరాకు 4వేల రూపాయలు ఇస్తున్నారు. గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలు యాసంగి నాటికే సూర్యాపేట జిల్లాలోని 2.13లక్షల ఎకరాలకు అందుతాయి. మేమిప్పుడు ఓట్లు అడిగేందుకు రాలేదు. ఉదయం 11 గంటల నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ అందరం కూడా దుమ్ములో కాల్వల వెంటనే తిరిగినం. మొత్తం ఎస్సారెస్పీ కాల్వల వెంట తుమ్మలు మొలిచినయ్. కాల్వల్లో నీళ్లు తెచ్చేందుకు కాళేశ్వరం వద్ద గోదావరిపై మేడిగడ్డ ప్రాజెక్టు కడుతున్నం. కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికే దక్కుతుంది అని మంత్రి హరీశ్ తెలిపారు. కాళేశ్వరం పూర్తయితే ఈ సంవత్సరం యాసంగి పంటకు తుంగతుర్తి నియోజకవర్గంలో 90వేలు, సూర్యాపేట 80వేలు, కోదాడలో 40వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు.

Related posts

Leave a Comment