వామపక్షాలు, పోలీసుల తోపులాటలో ముక్కలైన జేసీ దిష్టిబొమ్మ!

కమ్యూనిస్టులను దొంగలు అన్న జేసీ
ధర్నా, రాస్తారోకో నిర్వహించిన వామపక్షాలు
జేసీకి ప్రజలు బుద్ధి చెబుతారన్న కమ్యూనిస్టు నేతలు
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సీపీఐ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. రాష్ట్రానికి రైల్వే జోన్, ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తాము పోరాటాలు చేస్తున్నామని… వీటి గురించి జేసీ దివాకర్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. ఎంపీ హోదాలో ఉండి కమ్యూనిస్టులను దొంగలు అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జేసీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.

దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ధర్నా చేపట్టారు. రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కమ్యూనిస్టు శ్రేణులు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వామపక్షాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దిష్టిబొమ్మను ఎలాగైనా దగ్ధం చేయాలని కమ్యూనిస్టులు, వారి నుంచి లాక్కోవాలని పోలీసులు చేసిన ప్రయత్నంలో దిష్టిబొమ్మ తునాతునకలైంది.

Related posts

Leave a Comment