వాకింగ్‌కు వెళ్లిన విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం.. హత్య

  • అత్యాచారం అనంతరం బాలికను నీటిలో ముంచి హత్య
  • తెలిసిన వారి పనేనని అనుమానం
  • పోలీసుల అదుపులో ఆటో డ్రైవర్!

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ బ్రహ్మణపల్లికి చెందిన అనసూయ, ప్రభు కుటుంబం బడంగ్‌పేటలోని రాజీవ్ గృహకల్పలో మూడేళ్లుగా నివసిస్తోంది. వీరి కుమార్తె వైష్ణవి (14) జిల్లెలగూడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

రోజూ లాగే ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్లిన వైష్ణవి తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం వరకు వెతికినా బాలిక ఆచూకీ లేకపోవడంతో రాత్రి ఏడు గంటల సమయంలో మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ భవనం పక్కన ఓ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వైష్ణవిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

వైష్ణవిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆమెను నీటిలో ముంచడం ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ఓ ఆటోలో తీసుకొచ్చి అక్కడ పడవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్న ఆటో టైర్ల ఆనవాళ్లు ఇందుకు ఊతమిస్తున్నాయి. పోలీసులు ఇప్పటికే ఆటోవాలాను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. బాలిక హత్య తెలిసిన వారి పనేనని అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

Leave a Comment