వంశధార నదిలో చిక్కుకున్న వారంతా సురక్షితం…!

సరుబుజ్జిలి: శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మందిని సహాయ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. వంశధార నదీ గర్భంలో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు, డ్రైవర్లు వరద కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో వీరంతా చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం పాటు శ్రమించి వారిని ఒడ్డుకు చేర్చారు. బాధితులంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
ముఖ్యమంత్రి అభినందన
వంశధార నదిలో చిక్కుకున్న 53 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. ఈ ఘటనపై సమాచారం తెలిసినప్పటి నుంచి ఆయన సహాయచర్యలను సమీక్షిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పడు సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయచర్యలు ఫలించి బాధితులు ఒడ్డుకు చేరుకోవడంతో ఆయన వారిని అభినందించారు.

Related posts

Leave a Comment