వంగవీటి రాధాను కలిసిన విజయసాయిరెడ్డి.. సుదీర్ఘ చర్చలు!

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడంపై ఆ పార్టీ నేత వంగవీటి రాధా మనస్తాపం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాధాను బుజ్జగించే నిమిత్తం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వద్దకు వెళ్లారు. విజయవాడలోని రాధా నివాసంలో ఆయన్ని విజయసాయి ఈరోజు కలుసుకున్నారు. రాధాతో ఏకాంతంగా సుమారు గంట సేపు చర్చలు జరిపినట్టు సమాచారం.

కాగా, నియోజకవర్గ ఇన్ ఛార్జిగా మల్లాది విష్ణును నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న రాధా, వైసీపీ కార్యక్రమాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాధాను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు నేరుగా రాధాను ఇటీవల కలిసి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఫలితం లేకపోవడంతో రాధాను అనునయించేందుకు విజయసాయిరెడ్డి ఈరోజు కలిసినట్టు పార్టీ వర్గాల సమాచారం.
Tags: vangaveeti radha,vijayawada, vijaya sai reddy, ysrcp party

Related posts

Leave a Comment