లోకం మెచ్చిన మహానటుడు ఎస్వీ రంగారావు

<span style=”color: #008000;”>- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు</span></strong>
‘‘తెలుగు సినిమా రంగానికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లు రెండు కళ్లు అయితే… ఎస్వీఆర్‌ గుండెకాయ’’ అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. ఎస్వీఆర్‌ లోకం మెచ్చిన మహానటుడనీ, ఆయనకి సరితూగగలిగిన నటుడు తెలుగు చిత్రసీమలో మరొకరు పుట్టలేదన్నారు. అందుకే ఆయన్ని ఎస్వీ రంగారావుగానే కాకుండా, యశస్వీ రంగారావుగా పిలుచుకుంటారన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సంగమం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎస్వీ రంగరావు శతజయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి వేడుకలకి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గుణచిత్ర (క్యారెక్టర్‌) నటులు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, రావికొండలరావు, నాజర్‌, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అన్నపూర్ణమ్మలతో పాటు, ఎస్వీఆర్‌తో కలిసి పనిచేసిన జమున, కృష్ణవేణి, కె.ఆర్‌.విజయ, శారద, రమాప్రభ, గీతాంజలి, రోజారమణిల్ని ఈ వేడుకలో వెంకయ్యనాయుడు సత్కరించారు. జ్యోతిప్రజ్వలన, ఎస్వీఆర్‌ చిత్రపటానికి పూలమాల సమర్పణ అనంతరం ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘‘నట యశస్వీ, విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ… ఇలా ఎన్ని బిరుదులైనా ఎస్వీ రంగారావు నటనకంటే చిన్నవే. ఆయన లేకపోయినా, ఆయన కుటుంబ సభ్యులు పదవుల్లో లేకపోయినా ఆయన ఇంతగా ప్రజల మనసుల్లో జ్ఞాపకమున్నారంటే అదంతా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. నాట్యకళని శాస్త్రబద్ధం చేసిన భరతముని కావ్యనాయకుడికి ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు అనే నాలుగు లక్షణాలుంటాయని తెలిపారు. ప్రతినాయకుడి లక్షణాల్ని కూడా వారు సూచించి ఉంటే అవి అచ్చంగా వెండితెరపై ఎస్వీఆర్‌ లక్షణాలే అయి ఉండేవనుకుంటా. ప్రతినాయక పాత్రల్లోనే కాకుండా, గుణచిత్ర (క్యారక్టర్‌) నటనలోనూ ఆయన మెప్పించారు. ప్రతినాయకుడి పాత్రల్లో నటించిన నటులపై మనకు వ్యతిరేక భావన కలుగుతుంటుంది. కానీ ఎస్వీ రంగారావుని రావణుడిగా, కీచకుడిగా, కంసునిగా ఇలా రకరకాల పాత్రల్లో చూసినా వ్యక్తిగతంగా ఆయనపై భక్తిభావం, ఆరాధాన కలుగుతుంది. ఒక రకంగా పాత్రలకే ఛాలెంజ్‌ విసిరిన నటుడాయన. కృష్ణుడు అనగానే ఎన్టీఆర్‌ ఎలా గుర్తుకొస్తారో, ఘటోత్కచుడంటే ఎస్వీఆరే గుర్తుకొస్తారు. నటుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా, తన నటనలో పరిపూర్ణత రాలేదని చెప్పుకొనేవారు. అది ఆయన గొప్పతనం. దేశం కోసం సొంత డబ్బుతోపాటు, వివిధ కార్యక్రమాల నిర్వహణతో వచ్చిన మొత్తాన్ని పలు సందర్భాల్లో దేశం కోసం వెచ్చించారు. అలాంటి గొప్ప నటుడు 56 యేళ్లకి చనిపోవడం బాధాకరం. ఎస్వీఆర్‌, సావిత్రి, ఘంటసాలలాంటి గొప్ప వ్యక్తులు మళ్లీ రారు. అలాంటి వాళ్లని తయారు చేయడం మన చేతుల్లోనే ఉంద’’న్నారు.

నటన నేర్చుకొని సినిమాల్లోకి రావాలి
ఎస్వీఆర్‌లాంటి విలక్షణ నటుడి నుంచి ఈతరం నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు ఎం.వెంకయ్యనాయుడు. ఎస్వీఆర్‌తో పాటు, శివరామకృష్ణ, అంజలీదేవి, సావిత్రి… ఇలా గొప్ప నటులు చాలా మంది ఉన్నారు, వాళ్ల నటనని చూసి నవతరం మెలకువలు నేర్చుకోవాలన్నారు. పాత సినిమాల్లో నవరసాలు కనిపించేవనీ, సంగీతం, సాహిత్యం వినిపించేదనీ… ఇప్పుడు మాత్రం వాయిద్యం, వాయించడమే పెరిగిందన్నారు. శృంగారం తగ్గింది, అంగారం పెరిగిపోయిందని చెప్పారు. ఇదివరకు కథానాయికల్ని కథానాయకులు తాకేవారు కూడా కాదని, కానీ శృంగారం కనిపించేదని… ఇప్పుడు మాత్రం తాకినా, గీకినా, గోకినా అది కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం అందమైన నటులున్నారని, అందమైన నటన, కనిపించడం లేదన్నారు. పాత సినిమాల్ని చూసి నవతరం పరిపూర్ణత సాధించాలని సూచించారు.

Related posts

Leave a Comment