రైలు సిగ్నల్‌ను ట్యాంపర్ చేసి రైలును దోచుకున్న దోపిడీ దొంగలు..

తెలివి మీరుతున్న దొంగలు
రైల్వే సిగ్నల్ ట్యాంపర్ చేసి ఆపేసిన చోరులు
రైలు ఆగగానే చోరీ
రైళ్లలో దోపిడీలకు పాల్పడే దొంగలు తెలివి మీరుతున్నారు. చోరీల్లో టెక్నాలజీని ఉపయోగిస్తూ దోచుకుంటున్నారు. తాజాగా చెంగల్పట్టు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన ఘటన రైల్వే అధికారులను నివ్వెరపరుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి సమీపంలోని వంగనూరు వద్ద సిగ్నల్‌ను ట్యాంపర్ చేసి రైలును ఆపేసిన దొంగలు భారీ దోపిడీకి ప్రయత్నించారు. అయితే, అప్రమత్తమైన కానిస్టేబుల్ కాల్పులు జరపడంతో దొంగలు ఓ ప్రయాణికురాలి నుంచి గొలుసు లాక్కుని పరారయ్యారు.

బాధిత ప్రయాణికురాలు మంజుల (48) కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని అరక్కోణం నుంచి వస్తూ బుధవారం సాయంత్రం చెంగల్పట్టు-కాచిగూడ రైలు ఎక్కారు. కడపలోని యర్రగుంట్ల జంక్షన్ దాటిన తర్వాత వంగనూరు స్టేషన్ అవుటర్‌లో సిగ్నల్ లేక రైలు నిలిచిపోయింది. గురువారం తెల్లవారుజామున చిమ్మచీకట్లో నిలిచిపోయిన రైలు ఎస్-4 బోగీపైకి దోపిడీ దొంగలు రాళ్లు విసిరారు. కోచ్ వద్దకు చేరుకుని తలుపులు తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. కిటికీల వద్ద నిద్రపోతున్న ప్రయాణికుల కోసం వెతికారు.

ఎస్1 బోగీ వద్దకు చేరుకున్న దొంగలు నిద్రపోతున్న మంజుల మంగళసూత్రాన్ని తెంపేశారు. ఆమె ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. మంగళసూత్రం 4.5 తులాలు ఉంటుందని ఆమె తెలిపింది. రైలు ఆగడం, దొంగలు బీభత్సం సృష్టిస్తుండడంతో అప్రమత్తమైన రైలులోని జీఆర్పీ కానిస్టేబుల్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు పరారయ్యారు. రైలు కాచిగూడ చేరుకున్న తర్వాత మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

Leave a Comment