రివ్యూ: సాక్ష్యం

క‌థానాయ‌కుడిగా బ‌ల‌మైన పునాదులు వేసుకొన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తొలి చిత్ర‌మే మంచి వ‌సూళ్లు సాధించింది. ఆ త‌ర్వాత ప్ర‌తి సినిమాకీ త‌న మార్కెట్ స్థాయిని పెంచుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆయ‌న సినిమాలు ఉన్న‌త‌మైన నిర్మాణ హంగుల‌తో రూపొందుతుంటాయి. ‘సాక్ష్యం’ కూడా ఆ కోవ‌లోకి చెందిన చిత్ర‌మే. ఓ మినీ బాహుబ‌లిలా తీశామ‌ని చెబుతోంది చిత్ర‌బృందం. పంచ‌భూతాలే క‌ర్మ‌కి సాక్షి అనే అంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ్రీవాస్ ద‌ర్శ‌కుడు. ఇదివ‌ర‌కు ఆయ‌న ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టేట‌ర్’ చిత్రాల‌తో విజ‌యాల్ని సొంతం చేసుకొన్నాడు. ప్ర‌చార చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన ‘సాక్ష్యం’ ఎలా ఉంది? ఏ మేరకు ఆకట్టుకుంది? సాయి శ్రీనివాస్‌ ఖాతాలో మరో విజయం పడిందా?

కథేంటంటే: రాజావారి కుటుంబం(శరతకుమార్‌ ఫ్యామిలీ)తనకు అడ్డు వస్తోందని మునుస్వామి సోదరులు(జగపతిబాబు బ్రదర్స్‌) ఆ కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తారు. ఈ ఘాతుకానికి సాక్ష్యం ఎవరూ ఉండకూడదని పిల్లలు, పశువులతో సహా అందరినీ చంపేస్తారు. అయితే, రాజావారి ఇంటిలో లేకలేక పుట్టిన పిల్లాడు విశ్వ(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) తప్పించుకుంటాడు. విశ్వ విదేశాల్లో పెరిగి పెద్దవాడవుతాడు. 20ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చి, తనకు తెలియకుండానే తన శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ కథ.

ఎలా ఉందంటే: పగ, ప్రతీకారాల నేపథ్యంలో వచ్చిన సినిమాలను చాలానే చూశాం. అయితే, దానికి ఓ కొత్త నేపథ్యం ఎంచుకోవడంలోనే విజయం దాగుంది. కథానాయకుడు తన తల్లిదండ్రులను చంపిన వారిని ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ చంపాడు అనే పాయింట్‌ చాలా బలహీనంగానూ, రొటీన్‌గానూ కనిపిస్తుంది. అయితే దానికి పంచభూతాలు అనే నేపథ్యాన్ని తెలివిగా జోడించాడు దర్శకుడు. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం ఈ పంచభూతాలను దర్శకుడు తెలివిగా వాడుకున్నాడు. వాటిని ఉపయోగించి, శత్రు సంహారం ఎలా చేశాడో తెలియాలంటే ఈ సినిమా చూడాలి. తొలి పది నిమిషాలు చాలా పట్టుగా, ఉత్కంఠ భరితంగా తెరకెక్కించగలిగాడు. అయితే, ఆ తర్వాత విదేశాల్లో సాగిన విశ్వ, సౌందర్య లహరి(పూజ హెగ్డే)ల ప్రేమకథ కాస్త విసిగిస్తుంది. వీడియోగేమ్‌ల నేపథ్యం కూడా అదే బాపతు. కథానాయకుడిని ఇండియా తీసుకొచ్చాక, శత్రు సంహారం మొదలు పెట్టిన తర్వాతే కథ జోరందుకుంది. విశ్రాంతి ఘట్టం మరోసారి ఉత్కంఠ రేకెత్తించేలా సాగడంతో ప్రథమార్ధం గట్టెక్కగలిగింది.

రెండో భాగంలో మిగిలిన శత్రువులను కథానాయకుడు చంపే విధానం ఆద్యంతం మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించగలిగాడు. యాక్షన్‌ ఎపిసోడ్‌ ఒక్కోటి ఒక్కో తరహాలో సాగుతుంది. పంచ భూతాలను యాక్షన్‌ ఎపిసోడ్‌లో మేళవించాలన్న ఆలోచన రొటీన్‌ కథను సరికొత్తగా ఆవిష్కరించింది. కథానాయకుడికి తన గతం తెలియకుండా దాస్తూనే, తనకు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేలా చూపించడం కొత్త ఎత్తుగడ. పంచ భూతాలకు సంబంధించిన లింకులన్నీ సరిగానే వేసుకున్నాడు. అయితే, మధ్యమధ్యలో సినిమాను మరింత కమర్షియల్‌ చేయడానికి పాటలను ఇరికించాడేమో అనిపిస్తుంది. సందర్భం ఏదైనా, ఒక ఫాస్ట్‌ బీట్‌ పాటను పెట్టడం వల్ల కథకు సడెన్‌ బ్రేకులు పడినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఊహించినట్లు సాగినప్పటికీ మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే, ఒక సగటు కథను, ఒక కొత్త నేపథ్యం ఎంచుకుని, భారీ హంగులు జోడించి, తెరకెక్కించడంలో దర్శక-నిర్మాతలు సఫలీకృతమయ్యారు.

Related posts

Leave a Comment