రివ్యూ: శ్రీనివాస కళ్యాణం

వరుస మాస్‌ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసి, ‘ఇష్క్‌’తో తన పంథాను మార్చుకున్న యువ కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ‘ఛల్‌ మోహన్‌రంగా’ చిత్రంతో అలరించిన నితిన్‌..తాజాగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. కథల ఎంపికలో తనదైన ముద్రవేయడమే కాకుండా, కుటుంబ ప్రేక్షకులను సైతం థియేటర్లకు రప్పించగల నిర్మాత దిల్‌ రాజు. గతేడాది సతీష్‌ వేగేశ్నతో కలిసి ‘శతమానం భవతి’తో బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ అందించారు. ఇప్పుడు అదే దర్శకుడితో ‘శ్రీనివాస కళ్యాణం’ అంటూ మరోసారి కుటుంబ కథా నేపథ్యాన్నే ఎంచుకున్నారు. గత చిత్రంలో పండగ విశిష్టతను చెప్పిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు. మరి ‘శ్రీనివాస కళ్యాణం’ కమనీయంగా జరిగిందా? అతిథులుగా థియేటర్లకు విచ్చేసిన ప్రేక్షకులకు చిత్ర బృందం ఎలాంటి విందు భోజనాన్ని వడ్డించింది?

కథేంటంటే: విలువలు, కట్టుబాట్లు, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే కుటుంబం నుంచి వచ్చిన యువకుడు శ్రీనివాస్‌(నితిన్‌). ప్రతి నిమిషాన్నీ డబ్బుతో కొలుస్తూ, వ్యాపారమే పరమావధిగా భావించే వ్యక్తి ఆర్కే(ప్రకాష్‌రాజ్‌). అతని కుమార్తె శ్రీదేవి(రాశీ ఖన్నా)ని చూసి ఇష్టపడతాడు శ్రీనివాస్‌. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లన్నా, పెళ్లి సంప్రదాయాలన్నా శ్రీనివాస్‌కు చాలా ఇష్టం. తన పెళ్లిని ఒక వేడుకలా చేసుకోవాలనుకుంటాడు. నాయనమ్మ(జయసుధ) కూడా తన మనవడి పెళ్లిని ఉత్సవంలా చేయాలని అనుకుంటుంది. అయితే, ఆర్కే మాత్రం సంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. మరి అలాంటి వ్యక్తి తన కూతురి ప్రేమకు విలువ ఇచ్చాడా? తన కుమార్తెను ఒక సంప్రదాయ కుటుంబంలోకి పంపించాడా? వీరిద్దరి పెళ్లి చేయడానికి అతను పెట్టిన షరతులేంటి? అనేదే కథ!

ఎలా ఉందంటే: టైటిల్‌లోనే ఇది ఒక పెళ్లి నేపథ్యంలో సాగే కథ అని చెప్పేశారు. ఆచారాలు, కట్టుబాట్లు పెళ్లితంతు వీటి గురించి ఒక కథ చెప్పబోతున్నామని సినిమా రూపకర్తలు ముందే చెప్పేశారు. ఈ సినిమా దానికి తగ్గటుగానే ఉంది. ఒక్కసారిగా మనల్ని 20ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు దర్శకుడు. అప్పట్లో తెలుగింటి పెళ్లిళ్లు ఘనంగా జరిగేవి. ఈరోజుల్లో పెళ్లి అంటే కేవలం ఒక కార్యక్రమంలా మారిపోయింది. అది కార్యక్రమం కాదు.. జీవితంలో వచ్చే ఒక మధురమైన జ్ఞాపకం అని చెప్పే ప్రయత్నం చేశాడు. ‘శతమానంభవతి’లో ఇంటిల్లిపాదీని ఆకట్టుకునేలా, వారిని థియేటర్‌లో కూర్చోబెట్టే కథాంశాన్ని ఎంచుకున్నాడు. పండగ విశిష్టతను చెబుతూ అలరించాడు. ఇందులో అదే కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకుని పెళ్లి విశిష్టతను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అటు ఆర్కే, ఇటు శ్రీనివాస్‌‌ పాత్రల చిత్రీకరణ రెండింటినీ సమాంతరంగా చూపిస్తూ, వాళ్ల అభిరుచులకు, అభిప్రాయాలకు, పెళ్లికి వాళ్లు ఇచ్చే విలువలకు, కథను ముడిపెట్టిన ఫీల్‌ నచ్చుతుంది. పెళ్లికి ముందే విడాకుల అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకోవడం ఒక కొత్త రకమైన ఆలోచన అనుకోవచ్చు. తొలి భాగంలో కథానాయకుడి పాత్రను చూపిస్తూ, సరదా సన్నివేశాలను రాసుకొంటూ కథానాయికతో ప్రేమ వ్యవహారాన్ని ముడిపెడుతూ సాగిపోయింది. ఇక ద్వితీయార్ధం పూర్తిగా పల్లెటూరికి వెళ్లిపోతుంది. పెళ్లి ఇంట జరిగే రకరకాల తంతును కథానుగుణంగా పూసగుచ్చినట్టు చెప్పారు. దాంతో ప్రేక్షకుడికి ఒక పెళ్లింట్లో కూర్చొన్న అనుభూతి కలుగుతుంది. పతాక సన్నివేశాల్లో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. అయితే, అక్కడ కూడా ఎమోషన్స్‌కు పెద్ద పీట వేయడంతో కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా నిలుస్తుంది. అయితే, చెప్పిన విషయాన్నే పదే పదే చెప్పడం, కథానాయకుడి పాత్ర చిత్రణ, అతి సంభాషణలు, సందేశాలకు పరిమితం కావడం, కొన్ని చోట్ల కేవలం డైలాగ్‌ల కోసం సన్నివేశాలు రాసుకోవడం, ఎమోషన్స్‌ కథలో అంతర్లీనంగా కాకుండా పైపైనే అంటీ ముట్టన్నట్లు చిత్రించడం కాస్త ప్రతికూలాంశాలుగా కనిపిస్తాయి.

Related posts

Leave a Comment