రాయలసీమ గడ్డపై కేసీఆర్ కు అపారమైన ప్రజాభిమానం

వెంకటాపురంలో కేసీఆర్ ను చూసి ప్రజల కేరింతలు
గతంలో అనంతపురానికి ఇన్ చార్జ్ మంత్రిగా చేసిన కేసీఆర్
పరిటాల రవితో స్నేహబంధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, విభజనకు ప్రధాన కారకుల్లో ఒకరిగా ముద్రపడ్డ ప్రస్తుత తెలంగాణ సీఎంపై ఆంధ్రా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం తాత్కాలికమేనని తేలిపోయింది. నిన్న అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్ వివాహానికి కేసీఆర్ హాజరైన వేళ, అదే పెళ్లికి వచ్చిన సామాన్య ప్రజల నుంచి తనకు లభించిన స్వాగతం, తనను చూసిన తరువాత వారిలో వచ్చిన ఉత్సాహం కేసీఆర్ ను కూడా ఆశ్చర్యపోయేలా చేశాయి. కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే, ఆ ప్రాంతమంతా కేరింతలతో నిండిపోయింది. కేసీఆర్ సైతం నలువైలులా తిరుగుతూ వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన వారికి అభివాదం చేశారు. విభజన తరువాత తొలిసారిగా కేసీఆర్ అనంతపురానికి రాగా, ఆయనకు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. 1995 నుంచి 1999 వరకూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లాకు కేసీఆర్ ఇన్ చార్జ్ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయనకు, దివంగత పరిటాల రవికి మంచి స్నేహబంధం పెరిగింది. అప్పట్లో కేసీఆర్ రాయలసీమలోని బలమైన కమ్మ వర్గానికి దగ్గరయ్యారు. అదే బంధాన్ని గుర్తుంచుకున్న పరిటాల అభిమానులు, అనంత ప్రజలు తమ వద్దకు వచ్చిన కేసీఆర్ పై అమిత ఆదరాబినానాన్ని చూపారు. అనంతరం కేసీఆర్, వెంకటాపురంలోనే ఉన్న పరిటాల రవి స్మారకస్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Related posts

Leave a Comment