రాజీనామా చేసిన వైకాపా ఎంపీలకు చంద్రబాబు సవాల్!

రాజీనామా చేసిన వైకాపా ఎంపీలకు చంద్రబాబు సవాల్!

వైకాపా ఎంపీలవి రాజీ’డ్రామాలు’
ధైర్యముంటే ఎన్నికలు రావాలి
విమర్శలు మాని పవన్ కేంద్రంపై పోరాడాలి
కర్నూలులో చంద్రబాబునాయుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశామని డ్రామాలు ఆడుతూ, అవి ఆమోదం పొందకుండా జాగ్రత్త పడుతున్నారని, వారికి ధైర్యముంటే ఎన్నికలకు రావాలని, అప్పుడు బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయో, వైకాపాకు ఎన్ని ఓట్లు వస్తాయో తేలుతుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు జరిపించాలని సవాల్ విసిరిన ఆయన, ఎన్నికలు జరిగితే 5 స్థానాలనూ తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.

కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన, 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాబోదని, ప్రాంతీయ పార్టీలదే హవా అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని విమర్శించడం మాని, హోదా కోసం కేంద్రంతో పోరాడాలని హితవు పలికారు.

ఇటీవల 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిందని గుర్తు చేసిన ఆయన, నరేంద్రమోదీపై వ్యతిరేకత పెరిగిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ముందుండి చక్రం తిప్పేది తెలుగుదేశం పార్టీయేనని, ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీలు అన్నిటినీ అమలు చేయించుకుని తీరుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

కేంద్రం నుంచి మరిన్ని నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, న్యాయం కోసం తాను పోరాడుతున్నానని తెలిపారు. బీజేపీ తెలుగు ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని, అందుకే తాను ధర్మ పోరాటానికి దిగానని చెప్పారు. రమణదీక్షితులతో వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్లి తనపై విమర్శలు చేయించారని, శ్రీవారి దేవాలయాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించిన చంద్రబాబు, అటువంటి వారిని వెంకటేశ్వరస్వామి ఊరికే వదిలిపెట్టడని నిప్పులు చెరిగారు.

Related posts

Leave a Comment